నీట్ పేపర్ లీక్ కేసులో సంచలనం.. నేరాన్ని అంగీకరించిన నిందితుడు
- రూ.30లక్షలు తీసుకుని పేపర్ లీక్
- పరీక్షకు ఒక రోజు ముందే బయటకొచ్చిన క్వశ్చన్ పేపర్
- లాడ్జిలో ఉండి ప్రిపేర్ అయిన అనురాగ్ యాదవ్
నీట్ పేపర్ లీక్ కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం 13మందిని అరెస్టు చేశారు పోలీసులు. వారిలో బిహార్, సమస్తిపూర్‌కు చెందిన 22ఏళ్ల అనురాగ్ యాదవ్ అనే విద్యార్థి, అతడి బాబాయి సికందర్ యద్వేంద్ర ఉన్నారు. అనురాగ్ యాదవ్‌ను పాట్నా పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అనురాగ్ యాదవ్ పేపర్ లీక్ నేరాన్ని అంగీకరించాడు.
రూ.30లక్షలకు పేపర్‌ను లీక్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జూనియర్ ఇంజినీర్ అయిన తన అంకుల్ మే 4వ తేదీన పేపర్ ఇవ్వడంతో ఆ రాత్రికి రాత్రే పూర్తిగా ప్రిపేర్ అయ్యానని నేరాంగీకార పత్రంలో పేర్కొన్నాడు. పరీక్షకు ముందే తన బాబాయి సికిందర్ యాద్వేంద్ర కోట నుంచి ఫోన్ చేశాడని అనురాగ్ యాదవ్ తెలిపాడు. పరీక్షకు ముందు అనారాగ్ యాదవ్ పాట్నాలోని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేశాడు. అక్కడ బస చేసేందుకు తగిన సికందర్ యద్వేంద్ర చూసుకున్నాడు.
ఈ వ్యవహారంలో కోచింగ్ సెంటర్ల ముసుగులో నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్‌లు తమ ప్రమేయాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. వారు ఒక్కో విద్యార్థి నుంచి రూ.30 నుంచి రూ.32లక్సల వరకు తీసుకున్నట్లు తమ స్టేట్‌మెంట్‌లో ఒప్పుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 13మంది అరెస్టు కాగా వారిలో నలుగురు విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు మరో తొమ్మిది మంది విద్యార్థులకు ఈవోయూ నోటీసులు జారీ చేశారు. జూన్ 17, 18న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా నీట్-యూజీ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోరుతూ 20మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.