ముంబైకి వస్తా.. ఆపగలరా?: అన్నామలై కౌంటర్

 ముంబైకి వస్తా.. ఆపగలరా?: అన్నామలై కౌంటర్

విశ్వంభర, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ నేత కే. అన్నామలై తీవ్రంగా స్పందించారు. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ నేత కే. అన్నామలై తీవ్రంగా స్పందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తనపై చేసిన వ్యాఖ్యలు లేదా బెదిరింపులు ముంబైకి రావడాన్ని ఏమాత్రం ఆపలేవని స్పష్టం చేశారు. ఇటీవల ముంబైలో జరిగిన శివసేన–ఎంఎన్ఎస్ ర్యాలీలో తనను ఉద్దేశించి అవమానకరంగా చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. తనను హేళన చేస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. రాజకీయ భేదాభిప్రాయాలు ఉండవచ్చు గానీ, వ్యక్తిగత దూషణలు చేయడం తగదని వ్యాఖ్యానించారు.

రాజ్ థాకరే తనపై చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా.. తనను బెదిరించే స్థాయి నాయకులు ఎవరోనని అన్నామలై ప్రశ్నించారు. తాను రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తినని, ఆ నేపథ్యంపై గర్వం ఉందని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లు, హెచ్చరికలు తనను భయపెట్టలేవని స్పష్టం చేశారు. ముంబైకి వస్తే తన కాళ్లు నరికేస్తామని సోషల్ మీడియాలో కొందరు రాస్తున్నారని ప్రస్తావిస్తూ.. అలాంటి మాటలకు తాను వెనకడుగు వేయనని అన్నారు. బెదిరింపులకు భయపడే వ్యక్తినైతే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదని.. తన గ్రామంలోనే ఉండేవాడినని వ్యాఖ్యానించారు.

Read More జీఎస్టీ సంస్కరణలు – దేశంలో విప్లవాత్మక మార్పుకు నాంది. – ఎం. వెంకయ్య నాయుడు

తాను చేసిన వ్యాఖ్యలు మరాఠీల గౌరవాన్ని తగ్గించాయన్న ఆరోపణలను అన్నామలై ఖండించారు. భారతదేశంలో కామరాజ్ వంటి మహానాయకుడిని గొప్పవాడిగా పేర్కొంటే ఆయన తమిళుడు కాకుండా పోతాడా అని ప్రశ్నించారు. అలాగే ముంబై ఒక ప్రపంచ స్థాయి నగరమని చెప్పడం ద్వారా మహారాష్ట్రీయుల పాత్రను తక్కువ చేసినట్లు ఎలా అవుతుందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ముంబై అభివృద్ధి మరాఠీ ప్రజల శ్రమ, సహకారం లేకుండా సాధ్యమయ్యేది కాదని ఆయన స్పష్టం చేశారు.

తనపై విమర్శలు చేస్తున్నవారిని అజ్ఞానంతో మాట్లాడుతున్నారని అన్నామలై విమర్శించారు. దుస్తులు, భాష ఆధారంగా ప్రజలను హేళన చేయడం తగదని అన్నారు. ముఖ్యంగా ధోవతి, లుంగీ వంటి వస్త్రధారణను అవమానించే ధోరణిని తీవ్రంగా తప్పుబట్టారు. తమిళులను తక్కువగా చూపించే ఆలోచనలున్న పార్టీలతో డీఎంకే పొత్తు కొనసాగించడం సరికాదని వ్యాఖ్యానిస్తూ, ఈ అంశంపై కూడా ఆయన ఘాటు విమర్శలు చేశారు.

Tags: