అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌కు అసెంబ్లీ ఆమోదం- 15 నెలల ఉద్యమానికి విజయం – న్యాయవాదుల్లో హర్షం
విశ్వంభర, షాబాద్:తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కీలక పరిణామం చోటుచేసుకుంది. “న్యాయవాదుల రక్షణ చట్టం–2026”ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా హైకోర్టు లీగల్ సెల్ స్టేట్ అడ్వైజర్ పీసరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ, న్యాయవాదులపై జరుగుతున్న దాడులు, హత్యలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం అవసరమని ఎన్నో ఏళ్లుగా కొనసాగిన పోరాటం ఫలించిందన్నారు. దాదాపు 15 నెలలపాటు న్యాయవాదులు నిరంతరంగా ఉద్యమాలు, నిరసనలు చేపట్టారని తెలిపారు.గత పదేళ్లలో పలువురు న్యాయవాదులపై దాడులు జరిగి, కొందరు ప్రాణాలు కోల్పోయారని, మరికొందరు తీవ్రంగా గాయపడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రతి ఘటన తర్వాత ధర్నాలు నిర్వహిస్తూ, చట్టం కోసం నిరంతర పోరాటం కొనసాగించామని చెప్పారు.ప్రభుత్వం ఈ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టడం పట్ల న్యాయవాదుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు స్వీట్లు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ చట్టం అమల్లోకి వస్తే న్యాయవాదులకు భద్రత మరింత బలపడుతుందని, న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం పెరుగుతుందని న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



