అవసరమైతే చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావొచ్చు: ఉద్ధవ్ థాక్రే
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వెలువడ్డాయి. ‘ఇది మోడీ గ్యారంటీ’ అంటూ ప్రచారం చేసిన బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నా మేజిక్ మార్కును మాత్రం దాటలేకపోయింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించని విధంగా వెలువడ్డాయి. ‘ఇది మోడీ గ్యారంటీ’ అంటూ ప్రచారం చేసిన బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నా మేజిక్ మార్కును మాత్రం దాటలేకపోయింది. ఎన్డీయే కూటమిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జేడీయూ అగ్రనేత నితీశ్‌కుమార్‌లు కీలకం కానున్నారు. బీజేపీ ఈ ఎన్నికల్లో సొంతంగా 272 మెజార్టీ మార్కు దాటే పరిస్థితి లేనందున కూటమిలో అతి పెద్ద పార్టీలైన టీడీపీ, జేడీయూలపై ఆధారపడాలి.
ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(బుధవారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావొచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వల్ల ఎవరైతే వేధించబడ్డారో వాళ్లు అందరూ ఇండియా కూటమిలో చేరుతున్నారని అన్నారు. చంద్రబాబును కూడా బీజేపీ వాళ్లు వేధించారని ఆరోపించారు. దీంతో ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
2014, 2019లో ఎన్డీఏ కూటమిగా అధికారంలోకి వచ్చినప్పటికీ ఒంటరిగానే అధికారం చేపట్టడానికి అవసరమైన మేజిక్ ఫిగర్‌ను బీజేపీ దక్కించుకుంది. పేరుకు ఎన్డీయేగా అధికారంలో ఉన్నా బీజేపీకి ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన అవసరం పడలేదు. ఇప్పుడు మాత్రం సీన్ మారింది. బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌కు 31 సీట్ల దూరంలో 241 వద్దనే నిలిచిపోయింది. దీంతో అధికారంలోకి రావడానికి, ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రాంతీయ పార్టీలపై బీజేపీ ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.