మావోయిస్టులకు బిగ్ షాక్.. ఛత్తీస్‌గఢ్‌లో 29 మంది మావోయిస్టుల లొంగుబాటు..!!
విశ్వంభర, నేషనల్ బ్యూరో: మావోయిస్టు ఉద్యమానికి మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గోగుండ ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్న 29 మంది మావోయిస్టులు బుధవారం భద్రతా బలగాల ముందు లొంగిపోయారు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: మావోయిస్టు ఉద్యమానికి మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గోగుండ ప్రాంతంలో క్రియాశీలకంగా ఉన్న 29 మంది మావోయిస్టులు బుధవారం భద్రతా బలగాల ముందు లొంగిపోయారు. పోలీసుల సమక్షంలో ఆయుధాలను అప్పగిస్తూ, హింసా మార్గాన్ని విడిచిపెట్టి సాధారణ జీవితం వైపు అడుగులు వేస్తామని వారు ప్రకటించారు. ఈ లొంగుబాట్లతో దర్భా డివిజన్ పరిధిలో మావోయిస్టుల ప్రభావం మరింతగా తగ్గినట్లు భద్రతా వర్గాలు అంచనా వేస్తున్నాయి.
లొంగిపోయిన వారిలో దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘం (డీఏకేఎమ్ఎస్)కు చెందిన ప్రముఖ నేత పొడియం బుధ్రా కూడా ఉన్నారు. ఆయనపై రూ.2 లక్షల రివార్డు ఉండటం విశేషం. అలాగే డీఏకేఎమ్ఎస్‌కు అనుబంధంగా పనిచేసే జనత సర్కార్ విభాగానికి చెందిన సభ్యులు, ఇతర మావోయిస్టు కార్యకర్తలు కూడా ఈ సరెండర్‌లో భాగమయ్యారు. ప్రభుత్వ పునరావాస విధానాలపై నమ్మకం పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని వారు తెలిపారు.
ఈ సందర్భంగా సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ మాట్లాడుతూ, మావోయిస్టుల పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు స్పష్టమైన ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. ఆయుధాలు వదిలి జనజీవనంలోకి వస్తే ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. హింసను వీడి శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని మిగతా మావోయిస్టులకు ఆయన పిలుపునిచ్చారు.
గోగుండ ప్రాంతంలో భద్రతా శిబిరం ఏర్పాటు చేసిన తరువాత మావోయిస్టుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా వారి మద్దతుదారుల నెట్‌వర్క్ బలహీనపడటంతో సరెండర్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇటీవల దంతేవాడలో 63 మంది లొంగిపోవడం, అంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సరెండర్లు జరగడం ఈ మార్పుకు నిదర్శనమని అధికారులు చెబుతున్నారు. కేంద్రం ఈ ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నియంత్రించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో, ఇటువంటి లొంగుబాట్లు కీలకంగా మారాయి.




