వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి
విశ్వంభర, చిక్కడపల్లి : వికలాంగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. హైదరాబాదు ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో శనివారం ఉదయం జాతీయ వికలాంగుల హక్కుల వేదిక తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, రాష్ట్ర కార్యదర్శి అడివయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్‌ను రూ.6000లకు పెంచాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, సహాయ పరికరాల కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు పరికరాలు పంపిణీ చేయాలని తెలిపారు. వికలాంగుల సంక్షేమానికి బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించాలని అన్నారు. అనంతరం సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి మాట్లాడుతూ వికలాంగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. వారికి సామాజిక భద్రత, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు వెంకటేష్, రాజు, స్వామి, కాశప్ప, చందు, భాగ్యలక్ష్మి, జంగు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.



