కంటి చుక్కల టీకాతో కోళ్ల మరణాలకు చెక్
- అసిస్టెంట్ డైరెక్టర్ డా. పి. పెంటయ్య
విశ్వంభర, కోదాడ: కోదాడ పట్టణం పరిసర ప్రాంతాల్లో గత నెలలో అకస్మాత్తుగా రోగాలతో చనిపోతున్న కోళ్లకి వివిధ ఔషధాలతో అందించిన వైద్యం ఫలించి మరణాలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా సర్జికల్ స్పిరిట్ వైద్యం లో చేర్చాక సత్ఫలితాలు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో కోళ్ల మరణాలు తిరిగి ప్రారంభం అవ్వగా అశోక్ నగర్ నుండి వ్యాధి సోకిన కోళ్లను ప్రాంతీయ పశువైద్యశాలకు తీసుకు వచ్చారు. కోళ్లను పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య, హైదరాబాద్ లోని కోళ్ల ప్రత్యేక వైద్యనిపుణుల సలహాలు తీసుకొని కొక్కెరరోగానికి చిన్న వయస్సులో అందించే చుక్కల టీకాలు రెట్టింపు మోతాదు గా రెండు చుక్కలు కంట్లో వేసి వైద్యం అందించారు. అనంతరం అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ, గతం లో వ్యాధి సొకడానికి ముందే టీకాలు వాడే పరిస్థితి. ఒక వేళ వ్యాధి సోకాక టీకా వేస్తే కోడి శరీరంలో వైరస్ తీవ్రత పెరిగి కోళ్లు త్వరగా మరణిస్తాయని టీకా తిరిగి వేయకుండా ఉండే పరిస్థితి ఉండేది అన్నారు. కానీ మారుతున్న కాలానుగుణంగా మార్పులు చేసి 5 రోజుల నుండి ఎంత వయస్సు ఉన్న కోడికైనా ఆరోగ్యంగా ఉన్నా జబ్బుతో ఉన్నా కోడి పిల్లలకు వేసే ఎఫ్ 1 లసోటా టీకా చుక్కలను ఒకటి బదులుగా రెండు చుక్కలు వేస్తే కోళ్ల మరణాలు అరికట్టవచ్చని ఈరోజునుండి కోదాడ పరిసరాల్లో ఉన్న కోళ్ళకి కంట్లో రెండు చుక్కల టీకా వేయించువలసినదిగా పెరటి కోళ్ల పెంపకం దారులకు సూచిస్తున్నామని తెలిపారు. కోసుకొని తినే కోడే కదాని అలసత్వం వహిస్తే కోడికి 32 వేల చొప్పున పది కోళ్లున్న రైతుకి మూడు లక్షల పైన నష్టం వాటిల్లుతుందని, కొంచెం శ్రద్ధ తో సకాలంలో వైద్యంతో లక్షల సంపద కాపాడుకొచ్చని అన్నారు.



