టాలీవుడ్లో సంచలనం.. ఇకపై నో బెనిఫిట్స్ షోష్
టాలీవుడ్ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి నిర్మాతలు తమకు పర్సంటేజ్ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎగ్జిబిటర్స్ కు నిర్మాతలు పర్సెంటేజ్ ఇస్తున్నారని గుర్తు చేశారు. మల్టీ ఫ్లెక్స్ తరహాలో పర్సంటేజ్ ఇవ్వకపోతే సినిమాల ప్రదర్శన ఆపేస్తామని స్పష్టం చేశారు. ఇక నుంచి అద్దె ప్రతిపాదికన సినిమాలు ప్రదర్శించలేమని అన్నారు.
జూలై 1 లోపు నిర్మాతలు దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. అయితే భారీ బడ్జెట్ సినిమాలు ప్రభాస్ కల్కి, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, అల్లు అర్జున్ పుష్ప 2, కమలహాసన్ భారతీయుడు 2 కు వీటి నుంచి మినహాయింపు ఇచ్చారు. అంతేకాదు.. ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ఉండవని ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ప్రకటించారు. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ పై నిర్ణయాలు తీసుకున్నారు.
ఆక్యుపెన్సీ లేకపోవడం, ప్రేక్షుకులు థియేటర్లకు రాకపోవడంతో తెలంగాణలో ఇప్పటికే పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూసి వేస్తున్నట్లు యాజమాన్యాలు ఇటీవలే ప్రకటించారు. ఇప్పుడు ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయంతో నిర్మాతలు ఎలా స్పందిస్తారో.. దానికి ఎగ్జిబిటర్స్ ఎలా రియాక్ట్ అవుతారో తేలాల్సి ఉంది. మొత్తానికి భారీ సినిమాలు విడుదలకు ముందు ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి.