త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ..!!

త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ..!!

విశ్వంభర, ఏపీ బ్యూరో: రాష్ట్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని తన ఆలోచనలకు మద్దతు ఇచ్చే వారితో కలిసి త్వరలోనే ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు.

విశ్వంభర, ఏపీ బ్యూరో: రాష్ట్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా చేసుకుని తన ఆలోచనలకు మద్దతు ఇచ్చే వారితో కలిసి త్వరలోనే ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఆదివారం సాయంత్రం విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ‘సంక్రాంతి ఆత్మీయ కలయిక’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాజకీయ భవిష్యత్‌పై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

గత ఏడాది ఏప్రిల్ 13న తాను రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన వెంకటేశ్వరరావు, ఆ ప్రకటనకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని తెలిపారు. అప్పటి నుంచి పార్టీ ఏర్పాటు కోసం అవసరమైన ఏర్పాట్లు, వ్యూహాలపై లోతుగా కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. పార్టీని ప్రారంభించే ముందు ఆర్థికంగా బలమైన పునాది అవసరమని పేర్కొన్న ఆయన, తగిన వనరులు సమకూరిన వెంటనే అధికారికంగా పార్టీ ఆవిర్భావం ఉంటుందని వెల్లడించారు.

Read More మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఊరట

అలాగే, ప్రజలు తమ అభిప్రాయాలు, ఆలోచనలను స్వేచ్ఛగా పంచుకునేందుకు విజయవాడ కేంద్రంగా ఒక ప్రత్యేక వేదికను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కేంద్రం ద్వారా సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చలకు అవకాశముంటుందని చెప్పారు.

ప్రసంగంలో దేశ పరిస్థితులపై కూడా ఆయన స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా అగ్రరాజ్యాలు చిన్న దేశాలపై దాడులకు పాల్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, భారత్ మరింత బలంగా, స్వతంత్రంగా నిలబడాల్సిన అవసరం ఉందని అన్నారు. అభివృద్ధి అంటే కేవలం కార్పొరేట్ సంస్థల వృద్ధి మాత్రమే కాదని స్పష్టం చేశారు. సామాన్య ప్రజలు ఆర్థికంగా ఎదగడం, జీవన ప్రమాణాలు మెరుగుపడడమే నిజమైన దేశాభివృద్ధి అని ఏబీ వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు.

Tags: