25న తిరుమలలో రథసప్తమి.. విస్తృత ఏర్పాట్లు..!!
విశ్వంభర, ఏపీ బ్యూరో: సూర్య జయంతి సందర్భంగా ఈ నెల 25వ తేదీన తిరుమలలో రథసప్తమి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు టీడీపీ వెల్లడించింది.
విశ్వంభర, ఏపీ బ్యూరో: సూర్య జయంతి సందర్భంగా ఈ నెల 25వ తేదీన తిరుమలలో రథసప్తమి మహోత్సవాలను నిర్వహించనున్నట్లు టీడీపీ వెల్లడించింది. రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీమలయప్ప స్వామివారు ఏడు వాహనాలపై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. పవిత్రమైన మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు.
వేదాల ప్రకారం ఈ పవిత్ర రోజునే సూర్యదేవుడు జన్మించి ప్రపంచానికి వెలుగును ప్రసాదించాడని విశ్వసిస్తారు. అందుకే రథసప్తమికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉండటంతో, టీటీడీ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.
భక్తుల సౌకర్యం, భద్రత దృష్ట్యా రథసప్తమి రోజున ఆలయంలో నిర్వహించే కొన్ని ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజున కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు నిర్వహించబోమని ప్రకటించింది. అయితే సుప్రభాతం, తోమాల సేవ, అర్చనలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది.
రథసప్తమి రోజున వాహన సేవల సమయాలు ఇలా ఉన్నాయి:
ఉదయం 5.30 గంటల నుంచి 8.00 గంటల వరకు – సూర్యప్రభ వాహనం
(సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు)
ఉదయం 9.00 గంటల నుంచి 10.00 గంటల వరకు – చిన్నశేష వాహనం
ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు – గరుడ వాహనం
మధ్యాహ్నం 1.00 గంటల నుంచి 2.00 గంటల వరకు – హనుమంత వాహనం
మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 3.00 గంటల వరకు – చక్రస్నానం
రథసప్తమి రోజున స్వామివారి వాహన సేవలను దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదమని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులు శాంతియుతంగా సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.



