లిక్కర్‌ స్కామ్‌ లో మిథున్ రెడ్డి ఈడీ విచారణ

లిక్కర్‌ స్కామ్‌ లో మిథున్ రెడ్డి ఈడీ విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసింది.

విశ్వంభర, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసింది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని శుక్రవారం ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఈడీ ప్రాంతీయ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు ఏడు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది.

మద్యం వ్యాపారంలో పెట్టుబడులు, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఆర్థిక లావాదేవీలపై అధికారులు మిథున్‌రెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ రూపకల్పన, డిస్టిలరీల కేటాయింపులు, ప్రైవేట్ వ్యక్తులకు చేరిన ముడుపుల అంశంపై ఈడీ విచారించింది. అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన రాతపూర్వక సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. విచారణ ముగిసిన అనంతరం ఆయన నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు.

Read More కాకినాడకు భారీ పెట్టుబడులు

ఈ కేసులో గురువారం మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని అధికారులు 7 గంటల పాటు విచారించి కీలక సమాచారం సేకరించారు. మిథున్‌రెడ్డిని విచారించడంతో పాటు ఆయన వాంగ్మూలాన్ని సెక్షన్ 50 (PMLA) కింద రికార్డ్ చేశారు. వీరిద్దరి స్టేట్‌మెంట్లలో ఏవైనా పొంతన లేని అంశాలు ఉంటే, మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉందని ఈడీ వర్గాలు వెల్లడించాయి. మిథున్‌రెడ్డి విచారణ ముగియడంతో, ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న మరికొందరు కీలక నేతలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

కేసు నేపథ్యమిదే
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాల్లో భారీగా నగదు అక్రమాలు జరిగాయని, డిస్టిలరీల నుంచి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం పక్కదారి పట్టిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులను విచారించిన అధికారులు, ఇప్పుడు రాజకీయ ప్రముఖుల పాత్రపై దృష్టి సారించారు.