'ఓ..! సుకుమారి' నుంచి ఐశ్వర్య రాజేష్ లుక్ విడుదల
విశ్వంభర సినిమా: ప్రముఖ నటి ఐశ్వర్యా రాజేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'ఓ..! సుకుమారి' నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న 'దామిని' పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ శనివారం విడుదల చేశారు. ఈ సినిమాలో ఒక పక్కా పల్లెటూరి పిల్లగా కనిపించనుంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఐశ్వర్య హాఫ్ శారీ కట్టుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని తరుముతున్న గ్రామస్తుల నుంచి తప్పించుకుని పరిగెడుతూ కనిపిస్తోంది. ఆమె ముఖంలోని పట్టుదల, అదే సమయంలో కనిపిస్తున్న చిలిపిదనం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఒక మొండి పట్టుదల కలిగిన పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఐశ్వర్య తన నటనతో మరోసారి మ్యాజిక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
'ప్రీ వెడ్డింగ్ షో' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో తిరువీర్ నటిస్తున్న సినిమా ఇది. 'శివం భజే' వంటి వైవిధ్యమైన చిత్రాన్ని అందించిన గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర రెడ్డి మూలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్త దర్శకుడు భరత్ దర్శన్ ఈ చిత్రాన్ని ఒక ఫుల్ లెంగ్త్ విలేజ్ ఎంటర్‌టైనర్‌గా, హాస్యం, భావోద్వేగాల కలయికతో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు అద్భుతమైన స్వరాలను అందిస్తున్నారు. 'రజాకార్', 'పొలిమేర' ఫేమ్ సి.హెచ్. కుషేందర్ విజువల్స్ అందిస్తున్నారు.'క' సినిమా ఎడిటర్ శ్రీ వరప్రసాద్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. 'బలగం' ఫేమ్ తిరుమల ఎం.తిరుపతి పల్లెటూరి వాతావరణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ వినోదాత్మక చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.



