యువతే దేశ భవిష్యత్ వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగాలి.
యువజన దినోత్సవం సందర్భంగా పిన్నాకిల్ అకాడమీ కార్యక్రమం
విశ్వంభర హనుమకొండ జిల్లా:-యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని పిన్నాకిల్ అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ ప్రతినిధి ఓదెల చంద్రమౌళి మాట్లాడుతూ, భారతదేశ యువతలో అపారమైన శక్తి, సృజనాత్మకత, మార్పును తీసుకువచ్చే సామర్థ్యం దాగి ఉందని అన్నారు. ఆ శక్తిని సరైన దిశలో మలిచినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.వక్త తన ప్రసంగంలో స్వామి వివేకానంద జీవితాన్ని ఉదాహరణగా తీసుకున్నారు. వివేకానందుడు పెద్దపెద్ద విద్యాభ్యాసాలు చేయకపోయినా, తన ఆలోచనలతో, ఆధ్యాత్మిక దృష్టితో భారతదేశ ప్రతిష్టను ప్రపంచవ్యాప్తంగా పతాక స్థాయికి తీసుకెళ్లారని వివరించారు. భారతదేశం కేవలం ఒక దేశం మాత్రమే కాదు, అది ఆధ్యాత్మికతకు పుట్టినిల్లు, విజ్ఞానానికి మార్గదర్శి, ఎన్నో రహస్యాలు దాగిన గొప్ప సంస్కృతి కలిగిన భూమి అని వివేకానందుడు ప్రపంచ మహాసభల్లో ధైర్యంగా చాటి చెప్పిన విషయాలను గుర్తు చేశారు.యువత వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని స్వయంక్రమశిక్షణ, క్రమబద్ధమైన జీవనశైలి, సమయాన్ని సద్వినియోగం చేసుకునే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. చదువు, విజ్ఞానం, క్రీడలు, సాంకేతికత, సేవా కార్యక్రమాలు అన్ని రంగాలలో ముందుండి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. యువశక్తి అనన్యసామాన్యమైనదని, అజేయమైనదని, ఏ లక్ష్యాన్నైనా సాధించగల సామర్థ్యం యువతకే ఉందని స్పష్టం చేశారు.నేటి సమాజం స్వార్థ భావనతో నిండిపోతున్న ఈ కాలంలో, విద్యార్థులు నిస్వార్థ బుద్ధిని అలవాటు చేసుకొని, మంచి గుణాలను ఆచరణలో పెట్టాలని అన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, కరుణ, సేవాభావం వంటి విలువలు వ్యక్తిగత జీవితానికే కాదు సమాజ పురోగతికీ మూలస్తంభాలని వివరించారు. విద్య అనేది ఉద్యోగ సాధనకే పరిమితం కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి, దేశ నిర్మాణానికి దోహదపడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, లక్ష్య సాధన పట్ల స్పష్టతను కల్పించిందని నిర్వాహకులు తెలిపారు. పిన్నాకిల్ అకాడమీ భవిష్యత్తులో కూడా ఇలాంటి విలువాధారిత, కార్యాచరణాధారిత కార్యక్రమాలను నిర్వహిస్తూ యువతను విజయం వైపు వేగవంతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అకాడమీ నిర్వాహకులు అనుహ్యా ,ఉపాధ్యాయులు,రశ్మిత ,హరిత, రాజకుమార్, రసజ్ఞ, అనీష. పాల్గొన్నారు.



