కాంగ్రెస్ దేశానికి పట్టిన పెద్ద పీడ: కిషన్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. సనాతన ధర్మానికి, దేశాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద అవరోధమని, ఆ పార్టీ పాలనలో దేశం భ్రష్టు పట్టిందని ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికలు కేవలం వార్డుల గెలుపు కోసం కాదని, తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించేవని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల పరిస్థితి ప్రస్తుతం "పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా" తయారైందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. పదేళ్ల కేసీఆర్ నియంతృత్వ పాలన పోవాలని ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తే, ఇప్పుడు ఆ పార్టీ మంత్రులు దోచుకున్నది పంచుకోవడానికి కొట్టుకుంటున్నారని ఆరోపించారు. అమరవీరుల ఆకాంక్షలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తుంగలో తొక్కాయని, కేవలం బీజేపీతోనే నిజమైన మార్పు సాధ్యమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
అభివృద్ధి విషయంలో కేంద్రం వెనకాడటం లేదని చెబుతూ కిషన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. షాద్‌నగర్ పరిసర ప్రాంతాల్లో రూ.3.50 లక్షల కోట్ల నిధులతో హైస్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. కేంద్ర బడ్జెట్‌లో హైదరాబాద్ కేంద్రంగా మూడు హైస్పీడ్ రైలు మార్గాలను ప్రకటించామని, ఇవి రాష్ట్ర ఆర్థిక రూపురేఖలను మార్చబోతున్నాయని చెప్పారు. కేంద్రం ఇస్తున్న నిధులను వాడుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం 'పెద్దరికం' చేస్తోందే తప్ప, అదనంగా ఏమీ చేయడం లేదని విమర్శించారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో 50 శాతం ఎంపీ స్థానాలను బీజేపీకి కట్టబెట్టిన ప్రజలు, మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే తరహాలో నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టిస్తారని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య జాతీయ స్థాయిలో రహస్య ఒప్పందం ఉందని, అందుకే విచారణల పేరుతో రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను రక్షించాలంటే కమల దళాన్ని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.



