అవినీతిపై ఉక్కుపాదం మోపుతాం: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర సహ ఇన్‌ఛార్జిలు అశోక్ పర్ణామి, రేఖా శర్మతో కలిసి "వికసిత తెలంగాణ.. బీజేపీ సంకల్ప పత్రం" పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ.. పట్టణ రూపురేఖలను మారుస్తామని హామీ ఇచ్చారు.
పెండింగ్‌లో ఉన్న పన్నుల విషయంలో ప్రజలకు భారీ ఊరట కల్పిస్తామని ప్రకటించారు. పట్టణాలను ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతామని, యువత కోసం ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులను పైసా పొల్లుపోకుండా పారదర్శకంగా ఖర్చు చేస్తామని రామచందర్ రావు వెల్లడించారు. మున్సిపాలిటీల్లో అవినీతికి తావులేకుండా చేస్తామని, ఎవరైనా అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు చురకలు
ఈ సందర్భంగా రామచందర్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఆ రెండు పార్టీలు వణికిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చిందని అడుగుతున్నారని, దానికి సమాధానంగా తాము జిల్లాల వారీగా లెక్కలు చెబుతామని, రేవంత్ రెడ్డి కూడా తన పాలనలో జిల్లాలకు ఏం చేశారో చెప్పగలరా అని సవాల్ విసిరారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం..
రామగుండం, మంచిర్యాల ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు దిగుతున్నాయని, దీనికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని రామచందర్ రావు ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించడం మానుకోవాలని, దాడులు కొనసాగితే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమేనన్న విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని ఆయన గుర్తు చేశారు.



