ఆర్టీసీ కళాభవన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి  

ఆర్టీసీ కళాభవన్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి  

 విశ్వంభర, జిహెచ్ఎంసి : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) మంగళవారం ఆర్టీసీ కళాభవన్ లో అత్యంత ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో టీజీఎస్ ఆర్టీసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీలు) సిహెచ్. వెంకన్న, ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, సోల్మన్, ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయపుష్ప తదితరులు పాల్గొని అంబేద్కర్‌కు అంజలి ఘటించారు. ​ఈ సందర్భంగా ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ, ఒక సమాజం ఎంత పురోగతి సాధించిందనేది ఆ సమాజంలోని మహిళలు సాధించిన అభివృద్ధిని బట్టే తాను కొలుస్తానన్న అంబేద్కర్ మాటలను ప్రతి ఒక్కరూ మనసా వాచా స్మరించుకోవాలని గుర్తు చేశారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య దేశంగా నిలవడానికి అంబేద్కర్ అందించిన అత్యున్నత రాజ్యాంగమే కారణమని ఆయన కొనియాడారు. ప్రతి పౌరుడికి సమాన హక్కులు, అవకాశాలు కల్పించి, రాజ్యాంగ రక్షణ అందించిన మహనీయుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, బాధ్యత కలిగిన పౌరులుగా జీవించడమే మనం ఆ మహనీయునికి ఇచ్చే అసలైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. ​అదేవిధంగా, సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమం పట్ల మేనేజ్‌మెంట్ ఎల్లప్పుడూ సానుకూలంగా ఉందని నాగిరెడ్డి గారు స్పష్టం చేశారు. కార్మికులు, సిబ్బంది ఎవరూ కూడా అనవసర ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, సిబ్బంది సమస్యలను పరిష్కరించడమే సంస్థ యొక్క ప్రధాన ధ్యేయమని ఆయన ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జేడీ సి.నర్మద, ఈడీ లు సిహెచ్.వెంకన్న. ఖుస్రో షా ఖాన్, రాజశేఖర్, సోల్మన్, ఎఫ్ఏ విజయపుష్ప, సిటీఎం  ఏం & సి.శ్రీధర్, సిపిఎం ఉషాదేవి, సీఈ(ఐటి)  శ్రీదేవి, రంగారెడ్డి ఆర్ఎం  శ్రీలత, ఎస్సీ, ఎస్టీ యూనియన్ చైర్మన్ రాజయ్య నాయక్, పలువురు ఆర్ఎం లు, అధికారులు  పాల్లొన్నారు.

Tags: