ఆ నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి
- 12న దేశవ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు
- కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనీఫ్ అహమ్మద్
విశ్వంభర, మహబూబ్ నగర్ : కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని, దేశవ్యాప్తంగా కార్మిక వర్గ సంక్షేమానికి కృషి చేయాలని, 12 గంటల పని విధానాన్ని రద్దుచేసి ఎనిమిది గంటల పని విధానాన్ని సమగ్రంగా అమలు చేయాలని కనీస వేతనాలు చట్టం పగడ్బందీ గా అమలు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హనీఫ్ అహ్మద్, తెలంగాణ కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ డిమాండ్ చేశారు ఈ మేరకు వారు మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పొరేటర్లకు అనుకూలంగా చట్టాలను సవరణ చేస్తున్నదని విమర్శించారు. ఫలితంగా ధనవంతులు మరింత ధనవంతులుగా పేదలు మరింత పేదలుగా మారుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాల ఫలితంగా సాగించుకున్న కార్మిక చట్టాలను సవరించి నాలుగు కోడ్స్ గా సమీకరించడం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నదని చెప్పారు. కార్మికుల శ్రమ సంపదతోనే దేశ సంపద అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. కార్మిక సంక్షేమా న్ని భారత రాజ్యాంగం ఆకాంక్షిస్తుండగా దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ పాలకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు . కనీస వేతనాలు అమలు చేయాలని కార్మికుల సంక్షేమాన్ని కాపాడాలని ప్రమాద బీమాను అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జామే మజీద్ కమిటీ అధ్యక్షులు మజీద్, వెల్పేర్ పార్టీ అధ్యక్షులు బజియుల్లా బేగ్, టీఎఫ్టీయూ కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



