పాలమూరుకు ద్రోహం చేశారు.. అందుకే డిపాజిట్లు గల్లంతు

బీఆర్ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి నిప్పులు 

పాలమూరుకు ద్రోహం చేశారు.. అందుకే డిపాజిట్లు గల్లంతు

గత పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేసినందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా చేశారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో:  గత పదేళ్ల పాలనలో పాలమూరు జిల్లాకు తీరని అన్యాయం చేసినందుకే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, కనీసం డిపాజిట్లు కూడా దక్కకుండా చేశారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఆయన రూ. 25 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రూ.80 వేల కోట్ల అంచనా వ్యయం ఉన్న ప్రాజెక్టుకు కేవలం రూ. 27 వేల కోట్లు ఖర్చు చేసి, 90 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోని మొత్తం 38 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ కేవలం మూడంటే మూడు చోట్ల మాత్రమే గెలిచిందని గుర్తు చేశారు. ప్రజలు ఛీకొట్టినా, ఎన్నికల్లో ఓడించినా బీఆర్ఎస్ నాయకుల తీరులో మార్పు రావడం లేదని, ఇప్పటికీ అహంకారంతోనే మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు.

పాలమూరు గడ్డపై కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉందని, పెండింగ్ ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. నేడు మూడు మున్సిపాలిటీల్లో సుమారు రూ. 60 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కురుమూర్తి స్వామి దేవాలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ. 140 కోట్లు కేటాయించిందని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంత బిడ్డ అయిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలమూరు జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.

Read More KTR: హార్వర్డ్ వేదికపై కేటీఆర్ ప్రసంగం.. అంతర్జాతీయంగా మరో గుర్తింపు