KTR: హార్వర్డ్ వేదికపై కేటీఆర్ ప్రసంగం.. అంతర్జాతీయంగా మరో గుర్తింపు
విశ్వంభర తెలంగాణ, బ్యూరో: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవకాశం లభించింది
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ అవకాశం లభించింది. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించనున్న 23వ ఇండియా కాన్ఫరెన్స్‌లో ప్రసంగించాలంటూ ఆయనకు అధికారిక ఆహ్వానం అందింది. హైదరాబాద్, తెలంగాణలను గ్లోబల్ మ్యాప్‌పై ప్రత్యేకంగా నిలబెట్టడంలో కేటీఆర్ చేసిన కృషిని గుర్తించిన నిర్వాహకులు ఈ ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు.
హార్వర్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఫిబ్రవరి 14, 15 తేదీల్లో ఈ రెండు రోజుల సదస్సు జరగనుంది. “ది ఇండియా వి ఇమాజిన్” అనే ప్రధాన అంశంతో ఈ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు, విధాన రూపకర్తలు, పారిశ్రామికవేత్తలు, సాంస్కృతిక రంగ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.
గతంలో ఈ ఇండియా కాన్ఫరెన్స్‌లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖులు పాల్గొన్నారు. నీతా అంబానీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, జైరాం రమేశ్, అజీమ్ ప్రేమ్‌జీ వంటి వ్యక్తులు తమ అనుభవాలు, ఆలోచనలను ఈ వేదికపై పంచుకున్నారు. ఇప్పుడు అదే జాబితాలో కేటీఆర్ పేరు కూడా చేరడం విశేషంగా మారింది.
తెలంగాణను టెక్నాలజీ, ఇన్నోవేషన్, స్టార్టప్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో కేటీఆర్ పోషించిన పాత్రకు గానూ ఈ ఆహ్వానం అందిందని నిర్వాహకులు ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు. కాన్ఫరెన్స్ తొలి రోజు హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో పాలన, అభివృద్ధి, ప్రజా విధానాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి.
రెండో రోజు హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో వ్యాపారం, ఆంత్రప్రెన్యూర్‌షిప్, గ్లోబల్ ఎకానమీపై సదస్సు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే కేటీఆర్ తన ప్రసంగం ఇవ్వనున్నారు. ప్రపంచ స్థాయి విద్యా వేదికపై తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను వివరించే అవకాశం రావడం రాష్ట్రానికి గర్వకారణంగా మారింది.



