వంట గ్యాస్ సిలిండర్లకు ఎలాంటి కొరత లేదు
- వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
విశ్వంభర,సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ లకు ఎలాంటి కొరతలేదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. శుక్రవారం అయన అదనపు కలెక్టర్ చాంబర్లో జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో ఎల్పిజి గ్యాస్ సరఫరాపై సమావేశం నిర్వహించారు. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి గ్యాస్ సరఫరా లో ఏలాంటి కొరత లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాల్ 4, 15, 509 డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయని ప్రస్తుతం జిల్లాలో 17, 647 డొమెస్టిక్ సిలిండర్లు,న552 కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని, గ్యాస్ బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల్లోనే వినియోగదారులకు సకాలంలో డెలివరీ చేయడం జరుగుతుందని వివరించారు. కమర్షియల్ సరఫరాలో ఏర్పడిన కొరతను అధిగమించేందుకు ఉపశమనం వైపు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని తెలిపారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ ను ఎవరైనా కమర్షియల్ గా వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి గ్యాస్ సరఫరాలో ఎలాంటి కొరతలేనందున ప్రజలు ఆందోళనకు గురై అనవసరంగా గ్యాస్ బుక్ చేసుకోవద్దని కోరారు. సీనియారిటీ ప్రకారం ఏజెన్సీలు గ్యాస్ ను సరఫరా చేయడం జరుగుతున్నదని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సరిపోయినంతగా ఉందని కలెక్టర్ మరోసారి చెప్పారు. గ్యాస్ బుకింగ్ కు సంబంధించి సర్వర్ సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కూడా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ విషయమై సంబంధిత గ్యాస్ ఏజెన్సీ లతో మాట్లాడడం జరిగిందని, త్వరలోనే సర్వర్ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎవరైనా ఏజెన్సీ నిర్వాహకులు అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జిల్లా పౌర సరఫరా అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ సివిల్ సప్లై రాము, తదితరులు పాల్గొన్నారు.



