ప్రజలలో పారిశుధ్యం పై అవగాహన పెంచుతాం.- మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు
విశ్వంభర, చండూరు : మున్సిపాలిటీలోని రెండవ వార్డు నుండి మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, వైస్ చైర్మన్ భూతరాజు దశరథ లు ప్రారంభించారు. రెండవ వార్డులోని ప్రజలందరిని పలకరిస్తూ, వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ త్వరలోనే మున్సిపాలిటీలో సిసి రోడ్లను, డ్రైనేజీల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అప్పటి వరకు రోడ్లపై మురికినీరు నిల్వ వుండకుండ జాగ్రత్తలు పాటించాలని, ఇండ్ల వద్ద గూణలు వేసుకుని, ఇంకుడు గుంత లాగా చేసుకోవాలని తెలిపారు. ఇండ్ల మధ్య పరిసరాలలో పిచ్చి మొక్కలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, చెత్తను రోడ్లపై, డ్రైనేజీల్లో వేయవద్దని కోరారు. ప్రజలందరూ పారిశుధ్యం పై అవగాహన పెంచుకొని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్యం మెరుగుపడినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ఆ దిశగా చండూరు మున్సిపాలిటీలోని ప్రతి వార్డుకు వెళ్లి పారిశుధ్యం పై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భూతరాజు దశరథ, రెండో వార్డు కౌన్సిలర్ బుషిపాక వాసు, ఏకాలపు ఆంజనేయులు, బోడ విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు.



