మంత్రుల వ్యక్తిగత జీవితాల దుష్ప్రచారంపై టీపీసీసీ చీఫ్ అసహనం
విశ్వంభర, బ్యూరో: తెలంగాణ రాష్ట్ర మంత్రుల ప్రైవేట్ జీవితాల గురించి, వారి వ్యక్తిగత విషయాల గురించి నిరాధారమైన వార్తలను ప్రచురించడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయ విమర్శలు విధానాల పరంగా ఉండాలి తప్ప, వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హితవు పలికారు. ఈ మేరకు శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు రేటింగ్‌ల కోసం, వ్యూస్ కోసం మంత్రుల వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలను అల్లుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాకు స్వేచ్ఛ ఉంది.. కానీ అది ఇతరుల ప్రైవేట్ జీవితాల్లోకి తొంగిచూసేలా ఉండకూడదని హితవు పలికారు. ఆధారాలు లేకుండా వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అని ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణలో ఆరోగ్యకరమైన రాజకీయ వాతావరణం ఉండాలని, వ్యక్తిత్వ హననానికి పాల్పడే సంస్కృతిని ప్రోత్సహించవద్దని ఆయన కోరారు. ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను, ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అనవసరమైన గాసిప్స్‌కు ప్రాధాన్యత ఇవ్వొద్దని ఆయన సూచించారు. బాధ్యతాయుతమైన జర్నలిజం వైపు మీడియా అడుగులు వేయాలని మహేష్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.



