మున్సిపాలిటీకి ఆదాయ మార్గాలను పెంచుకునే దిశగా దృష్టి సారించాలి

4
విశ్వంభర భూపాలపల్లి జూలై 16 ;- భూపాలపల్లి మున్సిపాలిటీకి ఆదాయ మార్గాలను పెంచుకునే దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణి అద్యక్షతన జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రధానంగా మున్సిపాలిటీకి వచ్చే ఆదాయ మార్గాలపై దృష్టి సారించారని, మున్సిపల్ ఆస్తులను గుర్తించి రెండు, మూడు రోజుల్లో నివేదికలను సమర్పించాలని కమిషనర్ను ఎమ్మెల్యే కోరారు. సమావేశంలో పలువురు కౌన్సిలర్లు మున్సిపల్ కు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయని అడగగా కమిషనర్, మున్సిపల్ అధికారులు సమాధానం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే జీఎస్సార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్తు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. వర్షాల నేపథ్యంలో ఈదురు గాలుల మూలంగా చెట్లు విరిగిపడటం, స్తంభాలు పడిపోవడం, విద్యుత్ తీగలు ఊడిపడడం వంటి ఘటనలు జరుగుతుంటాయని.., కావున, క్షేత్రస్థాయి సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా వెంటనే స్పందించాలని కోరారు. అదేవిధంగా, భూపాలపల్లి పట్టణంలోని ప్రధాన రహదారి వెంట డివైడర్ మధ్యలో ఉన్నటువంటి కోనోకార్పస్ చెట్ల వలన ప్రజలకు శ్వాసకోస వ్యాధులు కలుగుతున్నాయని, వాటిని పూర్తిగా తొలగించి, వాటి స్థానంలో వేరే చెట్లను నాటాలని సూచించారు. భూపాలపల్లిలో దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ లను తీసుకోకపోవడం మూలాన, మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుందని పలువురు కౌన్సిలర్లు కోరగా, వాటిపై కమిషనర్ దృష్టి సారించి, ఆదాయం పెంపు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానంగా రానున్న వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, రోడ్ల వెంట మురికి కాల్వలలో చెత్తా, చెదారం నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కాలనీలలో దోమల నివారణకు రెగ్యూలర్ గా ఫాగింగ్ చేయాలన్నారు. పలు ప్రభుత్వ కార్యాలయాలు, సింగరేణి క్వార్టర్స్, పలు పార్టీల రాజకీయ కార్యాలయాల నుండి పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్నులు మొత్తం వసూలు చేయాలని కమిషనర్ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ సమావేశంలో మునిసిపల్ కమిషనర్ రాజేశ్వర్, భూపాలపల్లి ఎమ్మార్వో శ్రీనివాస్, మున్సిపల్ డీఈ శ్రీనాథ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్ర హరీష్ రెడ్డి, పలు వార్డుల కౌన్సిలర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.