సూర్యాపేట సర్కారు దవాఖానాలో ‘ప్రైవేటు’ రాజ్యం...  అంత నా ఇష్టం నా రూల్స్ పాటించాల్సిందే

సూర్యాపేట సర్కారు దవాఖానాలో ‘ప్రైవేటు’ రాజ్యం...   అంత నా ఇష్టం నా రూల్స్ పాటించాల్సిందే

  • తీరు మార్చుకొని సూర్యాపేట జిల్లా ఆసుపత్రి
  • రోగులకు తప్పని ఇక్కట్లు
  • పై అంతస్తులకు వెళ్లకుండా గ్రౌండ్ లోనే టేబుల్ ఏర్పాటు
  • అధికారుల కన్నుగప్పేందుకేనా ఈ ఆంక్షలు?
  •  స్పందించని ఉన్నతాధికారులు..
  •  కలెక్టర్ తేజస్ జోక్యం కోరుతున్న హాస్పిటల్ కు వచ్చే పలువురు

విశ్వంభర, సూర్యాపేట :- ప్రభుత్వ ఆసుపత్రి అంటే పేదవాడికి ప్రాణప్రదాత కావాలి. కానీ, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం నిబంధనల పేరుతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అక్కడ ప్రభుత్వ నిబంధనలు నడవడం లేదు.. కేవలం కొందరు  రాసిన సొంత చట్టాలే అమలవుతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులను తలపించేలా ఉన్న ఈ 'ప్రైవేటు' రూల్స్ చూసి సామాన్యులు ముక్కు మీద వేలు వేసుకుంటున్నారు. 
 
గోప్యత వెనుక కారణమేమి?
 
ఆసుపత్రిలో పై అంతస్తులకు రోగులను వెళ్లనివ్వకపోవడం వెనుక పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు సమయానికి వస్తున్నారా? మందుల సరఫరా సక్రమంగా జరుగుతోందా? పలు  విషయాలు బయటకు రాకుండా ఉండటానికే టేబుల్ ఏర్పాటు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోగుల రద్దీని సాకుగా చూపిస్తూ, ఉన్నతాధికారుల కళ్లు కప్పి తమ అక్రమాలను సాగించుకోవడానికే ఈ సొంత నిబంధనలు పెట్టారని బాధితులు మండిపడుతున్నారు.
 
ప్రైవేటుకు కొమ్ముకాస్తున్నారా?. 
 
కొందరు సిబ్బంది ప్రైవేటు నెట్‌వర్క్‌తో చేతులు కలిపి, కావాలనే ప్రభుత్వ వైద్యం అందకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారా? అనే దిశగా విచారణ జరగాల్సిన అవసరం ఉందనీ ప్రజలు కోరుతున్నారు 
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సూర్యాపేటలో మాత్రమే ఈ ‘టేబుల్ రూల్’ ఉండటం గమనార్హం.
 
కలెక్టర్ తేజస్  స్పందించాలి!
 
జిల్లా యంత్రాంగంపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ప్రజలు ఇప్పుడు కలెక్టర్ తేజస్ వైపు ఆశగా చూస్తున్నారు.
ఆసుపత్రిలో గ్రౌండ్ ఫ్లోర్‌లో అక్రమంగా ఏర్పాటు చేసిన టేబుళ్లను వెంటనే తొలగించాలనీ, వైద్యుడిని కలిసే సదుపాయం కల్పించాలనీ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలనీ కోరుతున్నారు.
 
హాస్పిటల్ తీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు
 
ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందనీ కానీ హాస్పిటల్ తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనీ విమర్శలు వెలువెత్తుతున్నాయి.సూర్యాపేట జిల్లా ఆసుపత్రిలో ఈ ప్రైవేటు నింబంధనాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.
 
 
 
 
 
 
 

Tags: