చింతలు తీర్చే  శ్రీ చింతల ఆంజనేయ స్వామి. 

11 శనివారాలు , 11 ప్రదక్షిణాలు. - 300 సం.రాల చరిత్ర కలిగిన పురాతన ఆలయం.

చింతలు తీర్చే  శ్రీ చింతల ఆంజనేయ స్వామి. 

  • ఎంతో మహిమ గల ఆలయంగా ప్రసిద్ధి. 
  • రోడ్డు మార్గం సరిగ్గా లేక అభివృద్ధికి నోచుకోని వైనం. 
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి కి విజ్ఞాపన. 

విశ్వంభర, చండూర్ :- ఎంతో మహిమ కలిగిన మహిమాన్విత శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పట్టణ శివారు అంగడిపేట పరిధిలో ఉంది. చాలా విశిష్టత కలిగిన ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఎంతో అద్భుతమైన శక్తి కలిగిన ప్రాంతం. ఈ యొక్క ఆలయం స్థల పురాణం స్థానికుల సమాచారం మేరకు దాదాపు 300 సంవత్సరాల కు పైగా చరిత్ర కలిగిన పురాతన  ఆంజనేయ స్వామి దేవాలయం అని చెప్తున్నారు. ఈ ఆలయ ప్రాంతంలో పెద్ద ఎత్తున చింత చెట్లు ఉండేవని కాలక్రమేణా ప్రజలకు చింతల ఆంజనేయ స్వామి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. అప్పటి కాలంలో ప్రజలు ఈ ప్రాంతంలో నివసించేవారని మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక్కడ నివసించే వారు పలు  ప్రాంతాలకు వెళ్లి పోయారని ఆ తరవాత ఇక్కడ నాటి నుండి నేటి వరకు  ఈ గుడి మాత్రమే ఉండి మహిమ గల ఆలయం గా పేరొందుతూ నిత్యం స్వామి వారు పూజలు అందుకుంటున్నారు. విశాలమైన ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం లో ఆంజనేయ స్వామి వారిని   ఏ కోరిక కోరుకున్న నెరవేరుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. శనివారం , మంగళవారం సమయాల్లో పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారని ఈ ఆలయ అర్చకులు తెలిపారు. గతంలో భక్తులు వచ్చి స్వామివారికి విశిష్ట పూజలు నిర్వహించి కోరిన కోర్కెలు నెరవేరితే 41 ప్రదక్షిణాలు చేసి మొక్కులు చెల్లించుకునేవారు. ముఖ్యంగా  ఈ ఆలయం చుట్టూ కోరిన కోర్కెలు నెరవేరడానికి  11 శనివారాలు , 11 ప్రదక్షిణాలు చేస్తారు. వారి కోరికలు నెరవేరిన తరవాత స్వామి వారిని దర్శించుకొని 41 ప్రదక్షిణాలు చేసి స్వామి వారికి మొక్కులు చెల్లిస్తారు. ప్రతి శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగుతుంది.  పూర్వం ఆరోగ్యం బాగాలేనివారికి , ఆర్ధికంగా  నష్టపోయినవారికి , అన్ని శుభాలు కలగాలనే అనే వారు స్వామి వారిని దర్శించి ఒక రాత్రి స్వామి ఆలయంలో నిద్ర చేసేవారని అన్నారు. చాలా మంది దూర ప్రాంతాలలో వచ్చే భక్తులకు రోడ్డు సదుపాయం లేక సరిగ్గా రావడం లేదని అర్చకులు అన్నారు. ఈ గుడికి చేరుకోవాలంటే స్థానికులు కు , భక్తులకు చాల కష్టతరంగా మారింది. ప్రధాన రహదారి నుండి ఆలయానికి చేరుకోవాలంటే 2 కిలో మీటర్లు నడిచి వెళ్ళాలి. మరికొంతమంది ద్విచక్ర వాహనాలపై వెళ్లిన రోడ్డు పరిస్థితి ఇబ్బందిగానే ఉంటుంది. ఆలయానికి 500 మీటర్ల దూరంలో ఒక పెద్ద వాగును దాటి చేరుకోవాలి. వానాకాలంలో వాగు ఉధృతికి చాల మంది భక్తులు వెనెక్కి వెళ్ళిపోతారు. పురాతన ఆలయం అలాగే గొప్ప మహిమ గల ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేసి సరైన రోడ్డు మార్గం, వసతులు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ని స్థానికులు , భక్తులు కోరుతున్నారు. 

Tags: