షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం

షాపింగ్ మాల్‌లో అగ్నిప్రమాదం

విశ్వంభర, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్‌ 36లోని మంగళ గౌరీ షాపింగ్ మాల్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. మాల్‌లో ఉన్న సిబ్బంది, కార్మికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖకు చెందిన మూడు ఫైర్‌ ఇంజిన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే చర్యలు చేపట్టాయి. డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీఆర్ఎఫ్‌) సిబ్బంది, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మంటలు తీవ్రంగా వ్యాపించడంతో భవనం లోపల చిక్కుకున్న ఆరుగురు కార్మికులను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వారికి ప్రాథమిక చికిత్స అందించినట్లు తెలిసింది. ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, షోరూమ్‌లో మరమ్మతులు లేదా ఇంటీరియర్‌ పనులు జరుగుతున్న సమయంలో వెల్డింగ్‌ చిమ్మిన చినగుల వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై అగ్నిమాపక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మంటలు ఎగిసిపడుతున్న దృశ్యాలు చూసేందుకు స్థానికులు భారీగా చేరుకోవడంతో పాటు, జూబ్లీహిల్స్‌ రోడ్ నెంబర్‌ 36లో ట్రాఫిక్‌ తీవ్రంగా దెబ్బతింది. పోలీసులు రహదారిని కొంతసేపు మూసివేసి వాహనాలను మళ్లించారు.ఈ ప్రమాదంలో మాల్‌లో నిల్వ ఉంచిన విలువైన వస్త్రాలు, ఫర్నిచర్‌, ఇంటీరియర్‌ సామగ్రి పూర్తిగా దగ్ధమై కోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించినట్లు అంచనా. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చిన అనంతరం భవన భద్రతపై సాంకేతిక బృందం పరిశీలన చేపట్టనుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అగ్ని భద్రతా నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరముందని అధికారులు సూచించారు.

Tags: