బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ కన్నుమూత

బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ కన్నుమూత

హైదరాబాద్ శివారులోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ (90) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చిలుకూరులోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ శివారులోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ ఆలయ పూర్వ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ (90) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, చిలుకూరులోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, ఆలయ ప్రస్తుత ప్రధాన అర్చకులు సి.ఎస్. రంగరాజన్ అధికారికంగా ధృవీకరించారు.

భక్తుల హృదయాల్లో చెరగని ముద్ర
చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఎంతో నిరాడంబరంగా, క్రమశిక్షణతో నిర్వహించిన ఘనత సౌందరరాజన్ ది. భక్తుల వద్ద ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, స్వామివారి ప్రసాదాన్ని, సేవా విధానాన్ని అత్యంత ప్రశాంతంగా వివరించేవారు. సంప్రదాయాలను గౌరవిస్తూనే, సామాన్యులకు భగవంతుడిని చేరువ చేయడంలో ఆయన చూపిన మార్గం ఎందరికో స్ఫూర్తిదాయకం. హుండీ లేని దేవాలయంగా, కేవలం ప్రదక్షిణలతోనే మొక్కులు తీర్చుకునే అరుదైన సంప్రదాయాన్ని ఆయన ఎంతో నిబద్ధతతో కొనసాగించారు. ఆయన మృతి పట్ల భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు.

Read More ఘనంగా పౌర హక్కుల దినోత్సవం 

విద్యా, ఆధ్యాత్మిక రంగాలకు తీరని లోటు
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ మరణవార్త విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కేవలం అర్చకుడిగానే కాకుండా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌గా, అధ్యాపకుడిగా ఆయన గడించిన పేరు ప్రఖ్యాతులను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. విద్యావంతుడైన అర్చకుడిగా ఆయన ఆధ్యాత్మికతను, విజ్ఞానాన్ని జోడించి సమాజంలో చైతన్యం తెచ్చారని కొనియాడారు. చిలుకూరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో సౌందరరాజన్ పాత్ర కీలకమని సీఎం అన్నారు.

Tags: