ఓట్ల లెక్కింపు తర్వాత ‘రీ-వెరిఫికేషన్’.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థులు లేదా అనుమానాలు ఉన్న అభ్యర్థులు ఇప్పుడు నేరుగా ఈవీఎంలను, వీవీప్యాట్ స్లిప్పులను వెరిఫై చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఓడిపోయిన అభ్యర్థులు లేదా అనుమానాలు ఉన్న అభ్యర్థులు ఇప్పుడు నేరుగా ఈవీఎంలను, వీవీప్యాట్ స్లిప్పులను వెరిఫై చేసుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కౌంటింగ్ పూర్తయిన ఏడు రోజుల వరకు ఈ గడువు ఉంటుందని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రక్రియ ఉచితం కాదు, దీని కోసం అభ్యర్థులు నిర్దేశించిన కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వెరిఫికేషన్‌లో పొరపాట్లు జరిగినట్లు తేలితే, ఆ మొత్తాన్ని అభ్యర్థులకు తిరిగి రీఫండ్ చేస్తారు. ఈ నిర్ణయం వల్ల ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో, అభ్యర్థుల్లో విశ్వసనీయత పెరుగుతుందని ఈసీ భావిస్తోంది.
తమిళనాడు ఎన్నికల ప్రణాళిక సిద్ధం
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చెన్నైలో పర్యటించిన ఈసీ బృందం, రాష్ట్ర ఎన్నికల యంత్రాంగంతో సుదీర్ఘ సమీక్ష జరిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 75,000 పోలింగ్ స్టేషన్లలో ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల కనీస సౌకర్యాలు కల్పిస్తామని జ్ఞానేశ్ కుమార్ హామీ ఇచ్చారు. తమిళనాడులో అమలు చేస్తున్న ఎన్నికల నిర్వహణ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆయన కొనియాడారు. రాజకీయ పార్టీల విన్నపం మేరకు ఒకే విడతలో ఎన్నికల నిర్వహణపై కూడా ఈసీ సానుకూలంగా స్పందించింది.
కౌంటింగ్ విధానంలో మార్పులు
ఎన్నికల కౌంటింగ్ రోజున పోస్టల్ బ్యాలెట్ల విషయంలో తరచూ తలెత్తే వివాదాలకు ఈసీ చెక్ పెట్టింది. సాధారణంగా ఈవీఎంల లెక్కింపుతో పాటే పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తుంటారు. కానీ, ఇప్పుడు ఈవీఎం రౌండ్లు ప్రారంభం కాకముందే కనీసం రెండు రౌండ్ల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు. దీనివల్ల ఫలితాల సరళిపై మరింత స్పష్టత వస్తుందని, అధికారులపై ఒత్తిడి తగ్గుతుందని సీఈసీ వివరించారు.



