అంగన్వాడీ చిన్నారులకు ‘బ్రేక్‌ఫాస్ట్’ శుభవార్త

అంగన్వాడీ చిన్నారులకు ‘బ్రేక్‌ఫాస్ట్’ శుభవార్త

రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అమీర్‌పేట్‌లోని డైరెక్టరేట్ కార్యాలయంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కీలక ప్రకటన చేశారు. అంగన్వాడీ పిల్లలకు త్వరలోనే ఉదయం పూట పౌష్టికకరమైన బ్రేక్‌ఫాస్ట్ అందించే పథకాన్ని ప్రారంభించనున్నట్లు సీతక్క వెల్లడించారు. ఈ పథకానికి అవసరమైన ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని, చిన్నారులకు రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు.

బాలామృతం నాణ్యతపై రాజీ పడొద్దు
రాష్ట్రంలోని చిన్నారులకు అందించే బాలామృతం, బాలామృతం ప్లస్ ఉత్పత్తుల నాణ్యతను మరింత పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు. పోషకాహార విలువలను పెంచుతూ, పిల్లల ఎదుగుదలకు తోడ్పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా గెయిన్ ప్లాంట్ నిర్మాణ పనులను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని, ప్రజలకు సేవలను వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. అంగన్వాడీల నిర్వహణలో జిల్లా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని, క్షేత్రస్థాయిలో అందుతున్న పోషకాహారంపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని కోరారు.

Read More ఘనంగా వనస్థలిపురం జాతిరత్న పురస్కారాలు -

తెలంగాణ ఫుడ్స్ సిబ్బంది వినతి
ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఎం.ఏ.ఫహీమ్ సంస్థకు సంబంధించిన పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఫుడ్స్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్ డ్యూస్‌ను వెంటనే క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, హెల్త్ స్కీం ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఫుడ్స్ సిబ్బందికి కూడా ఆరోగ్య పథకాలను వర్తింపజేయాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క, సమస్యల పరిష్కారానికి సానుకూలంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రాంచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, ఎండి చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న సంక్షేమ పథకాల పురోగతిని వివరించారు.

Related Posts