చక్రాలపై తెలంగాణ కళావైభవం.. ‘జీఐ ఆన్ వీల్స్’ ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

చక్రాలపై తెలంగాణ కళావైభవం.. ‘జీఐ ఆన్ వీల్స్’ ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

 రాష్ట్ర విశిష్ట సాంస్కృతిక వారసత్వాన్ని, భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన కళారూపాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా శ్రీకారం చుట్టింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర విశిష్ట సాంస్కృతిక వారసత్వాన్ని, భౌగోళిక గుర్తింపు (జీఐ) పొందిన కళారూపాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘జీఐ ఆన్ వీల్స్’ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ప్రత్యేక బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. దేశంలోనే ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే తొలిసారి అని గవర్నర్ కొనియాడారు. 

ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. సంస్కృతి అనేది సమాజానికి ఆత్మ వంటిదని, సాంస్కృతిక అవగాహన లేని సమాజం అభివృద్ధి పథంలో ముందుకు సాగలేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువ రాష్ట్రమైన తెలంగాణ తన అస్తిత్వాన్ని, కళాకారుల నైపుణ్యాన్ని ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

Read More ఘనంగా విత్రీ న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ. - శుభాకాంక్షలు తెలిపిన పీసరి సురేందర్ రెడ్డి, పిసరి సతీష్ రెడ్డి.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. గవర్నర్ దూరదృష్టితో రూపొందిన ఈ ప్రాజెక్టు వల్ల గ్రామీణ కళాకారులకు కొత్త ఉపాధి మార్గాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జీఐ ఉత్పత్తుల మార్కెటింగ్, ప్రచారానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, టీజీఎస్‌ఆర్టీసీ బస్సులను ఒక సృజనాత్మక వేదికగా మలిచి ప్రతి సామాన్యుడికి మన సంప్రదాయాలను చేరువ చేస్తున్నామని పేర్కొన్నారు. తొలి విడతగా పోచంపల్లి ఇక్కత్, వరంగల్ తివాచీలు, కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ, నారాయణపేట్ చీరలు, చెరియల్, నిర్మల్ పెయింటింగ్స్ వంటి ఆరు ప్రముఖ హస్తకళలను బస్సులపై ఆకర్షణీయంగా ప్రదర్శించారు. ఇవి కేవలం అలంకారాలు మాత్రమే కాదని, తెలంగాణ కళాకారుల శ్రమకు, ప్రతిభకు ప్రతీకలని ఆయన స్పష్టం చేశారు.

సృజనాత్మకతకు ప్రోత్సాహం.. కళాకారులకు సన్మానం
టీజీఎస్‌ఆర్టీసీ ఎం‌డి నాగిరెడ్డి మాట్లాడుతూ.. జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ) విద్యార్థులు ఈ కళారూపాలను బస్సులపై ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు, మెమొంటోలను గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. అలాగే జీఐ గుర్తింపుల సాధనలో విశేష కృషి చేసిన సుభజిత్ సహాతో పాటు ఆరు రకాల కళారూపాలకు చెందిన కళాకారులను ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 18 జీఐ గుర్తింపుల ద్వారా నకిలీలను నివారించి, వారసత్వ కళలను రక్షించుకోవడమే కాకుండా, కళాకారుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే ఈ కార్యక్రమం యొక్క అంతిమ లక్ష్యమని అధికారులు వెల్లడించారు.

Related Posts