లిక్కర్ కేసులో క్లీన్‌చిట్‌పై సీబీఐ ‘రివర్స్’ అటాక్

లిక్కర్ కేసులో క్లీన్‌చిట్‌పై సీబీఐ ‘రివర్స్’ అటాక్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంగళవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మంగళవారం మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా మొత్తం 23 మంది నిందితులకు క్లీన్‌చిట్ ఇస్తూ, వారిపై ఉన్న కేసును కోర్టు డిస్మిస్ చేసింది. అయితే, ఈ విజయం తాలూకు సంతోషం నిందితులకు ఎంతోసేపు నిలవలేదు. తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి, ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అప్పీల్ దాఖలు చేసింది.

ఆధారాలు ఉన్నాయి.. మళ్లీ విచారించండి!
ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు ఏకపక్షంగా ఉందని, తమ వద్ద ఉన్న కీలక సాక్ష్యాలను, వాంగ్మూలాలను కోర్టు తక్కువ చేసి చూపిందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. లిక్కర్ పాలసీ రూపకల్పనలో భారీ స్థాయిలోఅవినీతి జరిగిందని, దీనికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన క్లీన్‌చిట్‌పై వెంటనే స్టే విధించాలని, కేసును పునఃసమీక్షించాలని హైకోర్టును కోరింది.

Read More నా రక్తం మరిగిపోతుంది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

రాజకీయ సంక్షోభం దిశగా లిక్కర్ కేసు
ఈ కేసులో క్లీన్‌చిట్ లభించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నాయి. ముఖ్యంగా కల్వకుంట్ల కవితకు కూడా ఊరట లభించిన తరుణంలో సీబీఐ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేవలం న్యాయపరమైన ప్రక్రియేనా లేక రాజకీయ ఒత్తిడితో చేస్తున్న ప్రయత్నమా అన్న చర్చ మొదలైంది. ఒకవేళ హైకోర్టు సీబీఐ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, స్టే విధిస్తే నిందితులందరికీ మళ్లీ కోర్టు చుట్టూ తిరగక తప్పదు.

తదుపరి అడుగు ఎటు?
హైకోర్టులో సీబీఐ వేసిన పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు న్యాయమూర్తి దీనిపై ఎలాంటి ప్రాథమిక వ్యాఖ్యలు చేస్తారన్న దానిపై అందరి దృష్టి నెలకొంది. మరోవైపు, నిందితుల తరపు లాయర్లు కూడా కావ్యాట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తద్వారా తమ వాదన వినకుండా ఎలాంటి స్టే ఇవ్వకూడదని కోరనున్నారు.

 

Related Posts