అన్నా.. నా వల్లే ఓడిపోయామా?.. కేటీఆర్ పోస్టుపై తీవ్రంగా స్పందించిన కవిత
ఢిల్లీ లిక్కర్ కేసులో తన తప్పు తేలకుండానే వ్యక్తిత్వ హననం చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కేసులో తన తప్పు తేలకుండానే వ్యక్తిత్వ హననం చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యానించారు. లిక్కర్ స్కామ్ కేసులో క్లీన్‌చిట్ వచ్చిన ఆనందం కంటే, సొంత అన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కలిచివేసినట్లు తెలిపారు. తనపై పెట్టిన కేసు వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని కేటీఆర్ అనడం సరికాదు అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. పార్టీ ఓటమిని తన మెడకు చుట్టే ప్రయత్నం చేయవద్దని, ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలని ఆమె హితవు పలికారు.
పాలనా వైఫల్యాలే ఓడించాయి.. నా కేసు కాదు!
బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలను కవిత విశ్లేషిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల హామీ నెరవేర్చకపోవడం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడమే ఓటమికి పునాది అని ఆమె పేర్కొన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న దోపిడీదారులకు మళ్లీ టికెట్లు ఇవ్వడం పార్టీకి తీరని నష్టం చేకూర్చిందని ఆమె కుండబద్ధలు కొట్టారు.
కేటీఆర్ ట్వీట్ రేపిన చిచ్చు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్‌చిట్ ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కేటీఆర్ చేసిన ఎక్స్ వేదికగా ఒక పోస్టు చేశారు. "లిక్కర్ స్కామ్ కుట్ర కారణంగానే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది" అని కేటీఆర్ పేర్కొనడంపై కవిత తీవ్రంగా మండిపడ్డారు. తీర్పును తమకు అనుకూలంగా మార్చుకుని మాట్లాడుతున్నారని, కానీ తన వ్యక్తిత్వాన్ని హననం చేసిన విషయాన్ని మర్చిపోతున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ ప్రజల తీర్పును గౌరవించడం నేర్చుకోవాలని ఆమె సూచించారు.



