లిక్కర్ కేసులో కవితకు క్లీన్‌చిట్
లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. కేసు నుంచి తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని, మొదటి నుంచి తాను చెప్పానని తెలిపారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యేనని కోర్టు తీర్పుతో తేలిపోయిందని ఆమె పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
కుటుంబానికి దూరం చేసి కక్ష సాధింపు
కవిత మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అన్యాయంగా తనను ఐదున్నర నెలల పాటు జైలులో ఉంచి, తన కుటుంబానికి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. లిక్కర్ కేసు వెనుక పొలిటికల్ కోణం ఉందని కేసీఆర్ ఆనాడే హెచ్చరించారని ఆమె గుర్తు చేశారు. ఇన్నాళ్లూ తనపై, తన కుటుంబంపై బురద చల్లిన వారు ఇప్పుడేం సమాధానం చెబుతారని కవిత నిలదీశారు. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులు బనాయించడం సరికాదని, ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని ఆమె హితవు పలికారు. న్యాయవ్యవస్థపై తనకు ఉన్న నమ్మకం నిలబడిందని, నిజం నిలకడ మీద తెలుస్తుందన్నది మరోసారి రుజువైందని ఆమె స్పష్టం చేశారు.



