ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం రూ.745 కోట్లు విడుదల
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్‌ను పరిష్కరిస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్‌ను పరిష్కరిస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్‌లో ఉన్న బకాయిల కోసం రూ.745 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి, వెంటనే నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో చాలా కాలంగా నిరీక్షిస్తున్న ఉద్యోగులకు పెద్ద ఉపశమనం లభించింది.
గ్రామ పంచాయతీలకు నిధుల జల్లు
కేవలం ఉద్యోగులకే కాకుండా, స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ.389 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు, సిబ్బంది వేతనాలు మరియు అత్యవసర పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంది. విడతల వారీగా అన్ని బకాయిలను తీరుస్తామని, ఖజానా పరిస్థితిని బట్టి ప్రాధాన్యత క్రమంలో నిధులు ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా విడుదలైన నిధులు ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుతున్నాయని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.



