తుపాకీ సిద్ధాంతం ఇక నడవదు.. మాజీ నేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి

తుపాకీ సిద్ధాంతం ఇక నడవదు.. మాజీ నేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి

దశాబ్దాల పాటు అడవిని నమ్ముకుని ఆయుధ పోరాటం చేసిన మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలు ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: దశాబ్దాల పాటు అడవిని నమ్ముకుని ఆయుధ పోరాటం చేసిన మావోయిస్టు పార్టీ మాజీ అగ్రనేతలు ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన అనంతరం మాజీ నేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి మీడియాతో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తుపాకీ సిద్ధాంతం నడవదని, హింస ద్వారా సాధించేది ఏమీ లేదని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి తమకు సానుకూలంగా స్పందించారని, త్వరలోనే లొంగుబాట్లపై అందరం కలిసి ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాస్తామని దేవ్‌జీ ప్రకటించారు.

కోటి రూపాయల రివార్డు.. సీఎం హామీలు
ప్రభుత్వ రివార్డు పాలసీని కోటి రూపాయలకు పెంచాలని, అలాగే లొంగిపోయిన వారికి ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు మాజీ నేతలు తెలిపారు. అయితే ఐదు ఎకరాల భూమి ఇవ్వడం ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని సీఎం సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ, లొంగిపోయిన వారికి నివాసం కోసం ఇల్లు, అర్హతను బట్టి ఉద్యోగం, గౌరవప్రదమైన జీవనభృతి కల్పిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని దేవ్‌జీ వివరించారు. అలాగే జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఇతర మావోయిస్టు నేతలను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని, వారితో చర్చించి మార్పు తెచ్చేందుకు కృషి చేస్తామని కోరారు.

Read More శ్రీ కరిగిరి వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం

భేటీలో ప్రభుత్వ యంత్రాంగం.. అగ్రనేతల సమక్షం
ఈ భేటీలో మాజీ మావోయిస్టు నేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి, సుజాతక్క, దామోదర్‌, చంద్రన్నలు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డిలతో పాటు అత్యున్నత స్థాయి అధికార యంత్రాంగం హాజరైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఏడీజీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచీ ఐజీ సుమతి వంటి కీలక అధికారులు భేటీలో ఉండి, లొంగిపోయిన వారికి కల్పించాల్సిన భద్రత, పునరావాస చర్యలపై చర్చించారు. 

Related Posts