లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ ఐ
విశ్వంభర, నిజామాబాద్ : బోధన్ టౌన్ ఎస్ ఐ భాస్కరాచారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఓ వ్యక్తిని కేసులో ఇరికించకుండా ఉండటానికి ఎస్సై రూ.10 వేలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అనంతరం దానిని రూ.7వేలకు తగ్గించాడు. సదరు వ్యక్తి బంధువు ఈ విషయమై ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. బుధవారం స్టేషన్లో ఎస్సైకి ఫిర్యాదుదారు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం పోలీస్స్టేషన్లో సోదాలు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
గతంలో పలువురు ఎస్సైలు
ఉమ్మడి జిల్లాలో గతంలో పలువురు ఎస్సైలు ఏసీబీకి చిక్కారు. 2024 నవంబర్లో.. ఓ కేసులో స్టేషన్ బెయిల్ కోసం రూ. 20వేలు లంచం తీసుకుంటూ వర్ని ఎస్సై కృష్ణకుమార్ అడ్డంగా దొరికిపోయాడు. 2024 నవంబర్లో లింగంపేట ఎస్సై అరుణ్, రైటర్ రామస్వామి లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. 2026 ఏప్రిల్లో బిచ్కుంద సీఐ సత్యనారాయణ ఏసీబీకి దొరికాడు. కల్లు దుకాణాల నిర్వహణకు సహకరించేందుకు ఆయన రూ.2 లక్షల లంచం అడిగాడు.
వరుస దాడులు
ఉమ్మడి జిల్లాలో ఇటీవల ఏసీబీ దాడులు పెరిగాయి. దీంతో అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, ఆర్టీవో ఆఫీసుల్లో ఇటీవల సోదాలు చేశారు. గతంలో ఆర్టీవో చెక్పోస్టులపై దాడులు చేశారు. అనంతరం ప్రభుత్వం వాటిని ఎత్తేసింది. ఇటీవల కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో అధికారులు సోదాలు చేశారు. ఏసీబీ దూకుడు పెంచడంతో అవినీతి అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తాము దొరికిపోతామోనని భయపడుతున్నారు.



