గ్యాస్ ధరల పెంపుపై సిపిఐ నిరసన

గ్యాస్ ధరల పెంపుపై సిపిఐ నిరసన

విశ్వంభర, హిమాయత్‌నగర్ : గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచి సామాన్య ప్రజలపై భారాన్ని మోపుతున్నారని సిపిఐ నేతలు విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు హైదరాబాదు జిల్లా సిపిఐ కౌన్సిల్ ఆధ్వర్యంలో సత్యనారాయణ రెడ్డి భవన్ నుంచి హిమాయత్‌నగర్ వై జంక్షన్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని, డీజిల్-పెట్రోల్ కృత్రిమ కొరతపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఈ సందర్భంగా ఈటి నరసింహ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచారని ఆరోపించారు. కమర్షియల్ సిలిండర్ ధరల పెరుగుదలతో టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు నడుపుతున్న యువత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెట్రోల్, డీజిల్ కొరతపై మాట్లాడుతూ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు కనిపిస్తున్నప్పటికీ కేంద్రం కొరత లేదని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనని విమర్శించారు. ధరలు మరింత పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేదలు, మధ్యతరగతి వర్గాలపై భారమవు తుందని పేర్కొన్నారు. మే 10న తెలంగాణకు ప్రధాని పర్యటన సందర్భంగా ప్రజలు నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్టాలిన్, కమతం యాదగిరి, బి వెంకటేశం, నేర్లకంటి శ్రీకాంత్, కాంపల్లి శ్రీనివాస్, మహమ్మద్ సలీం, ఉమర్ ఖాన్, సక్రిబాయి, బాలకృష్ణ, మహమూద్, బొడ్డుపల్లి కిషన్, చైతన్య, హైమద్, అనిల్ కుమార్, గౌస్, భగత్ సింగ్, షబ్బీర్, సుశాంత్, అరుణ్, లతీఫ్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: