అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే గాంధీ సమీక్ష సమావేశం
విశ్వంభర, శేరిలింగంపల్లి : నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలు చేపట్టవలసిన అభివృద్ధి పనులపై శేరిలింగంపల్లి జోన్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బుధవారం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన , జోనల్ కమిషనర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ,శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాలలో ఒకటిగా ఉండటంతో పాటు తీవ్ర ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పెండింగ్‌లో ఉన్న లింక్ రోడ్లను అత్యవసరంగా పూర్తి చేయాలని సూచించారు.అపర్ణా హిల్ పార్క్ నుంచి గంగారాం చెరువు వద్ద హనుమాన్ దేవాలయం వరకు జాతీయ రహదారికి కలిపే లింక్ రోడ్డు, అలాగే ముంబై జాతీయ రహదారి (NH-65) లోని బిహెచ్ఈఎల్ కల్వర్టు నుంచి శ్రీదేవి థియేటర్ రోడ్డుకు కలిపే లింక్ రోడ్డు పనులను ప్రాధాన్యతగా చేపట్టాలని కోరారు. ఈ పనులు పూర్తయితే ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు సమయం, ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు.చందానగర్ బొటానికల్ గార్డెన్ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాన్ని అత్యవసరంగా చేపట్టాలని సూచించారు. ఇవి వృద్ధులు, విద్యార్థులు మరియు పాదచారులకు సురక్షిత ప్రయాణాన్ని కల్పిస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, అవసరమైన నిధులను మంజూరు చేయాలని, సీసీ రోడ్లు, రోడ్ల మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను కోరారు. ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.చెరువుల సుందరీకరణలో భాగంగా పటేల్ చెరువు, గంగారాం చెరువు, అలీ తలాబ్, చాకలివాని చెరువు, గోపి చెరువులను అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే నాలాల విస్తరణ, పూడికతీత పనులను వర్షాకాలానికి ముందే పూర్తి చేయాలని, భవానిపురం నాల విస్తరణను ప్రాధాన్యతగా చేపట్టాలని కోరారు. కాలనీల్లో పార్కుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని తెలిపారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయాలని అధికారులను కోరారు.ఈ అంశాలపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి. సృజన సానుకూలంగా స్పందించారు.



