శంకర్పల్లిలో చీకట్లో రహదారులు
విశ్వంభర, శంకర్ పల్లి : శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో రాత్రి సమయంలో రహదారులు చీకటిలో మగ్గుతున్నాయి. నాలుగు దిక్కులుగా వెళ్లే రోడ్లలో ఒక్క దిశలో మాత్రమే సరైన వెలుతురు ఉండగా, మిగతా మార్గాలు అంధకారంలోనే ఉన్నాయి. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్ల ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ఎదురుగా వచ్చే వాహనాలు హైబీమ్ లైట్లు ఉపయోగించడం వల్ల డ్రైవర్లకు ముందున్న రహదారి కనిపించక ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. ఇప్పటికే ఉన్న స్ట్రీట్ లైట్లు కూడా రోడ్డు మీద కాకుండా పక్కలకు లేదా స్థంభం కింద మాత్రమే వెలుతురు ఇస్తుండటంతో ప్రయోజనం లేకుండా పోతున్నాయి. కొన్ని చోట్ల షాపులు, షోరూమ్‌ల వెలుతురు వల్ల మాత్రమే కొంత వరకు రహదారి కనిపిస్తోంది. సుమారు రెండు నెలల క్రితం పత్తాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకోగా, మూడు రోజుల క్రితం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద రెండు కార్లు ఢీకొన్న ఘటన కలకలం రేపింది. వీధి దీపాల లేమి కారణంగా ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, వీధి దీపాలను సరిచేసి రహదారులపై సరైన వెలుతురు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలు జరగకముందే నివారణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు



