రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు

రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు

  • : పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు
    కేటీఆర్ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

విశ్వంభర, హనుమకొండ: కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు  రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి పై వరంగల్ లో జరిగిన రైతు సంగ్రామ సభలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు వరంగల్ పోలీస్ కమిషనర్  సన్ ప్రీత్ సింగ్ ని కలిసి  వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షులు అయూబ్ ఖాన్  ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హంటర్ రోడ్డులో నిర్వహించిన సభలో కేటీఆర్ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. దేశ గర్వించదగ్గ నేత రాహుల్ గాంధీ పై, ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలకు దిగడం కేటీఆర్ అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజల్లో విద్వేషం రేకెత్తించేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై వెంటనే చట్టపరమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని వారు సీపీని డిమాండ్ చేశారు. ఇలాంటి పోకడలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

Tags: