గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం . -చేవెళ్ల నియోజకవర్గం లేబర్ సెల్ (INTUC) ప్రధాన కార్యదర్శి భానూరి శివశంకర్ గౌడ్ తీవ్ర ఆరోపణలు
- తోల్కట్ట ప్రభుత్వ భూములపై భారీ కుంభకోణం..!
- ఎకరానికి కోట్లు దోచుకున్న దళారులు –
- కలెక్టర్ విచారణకు డిమాండ్
విశ్వంభర, మొయినాబాద్:- చేవెళ్ల నియోజకవర్గం లేబర్ సెల్ (INTUC) ప్రధాన కార్యదర్శి భానూరి శివశంకర్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తోల్కట్ట గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూములు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో భారీగా కుంభకోణానికి గురయ్యాయని ఆయన వెల్లడించారు. పేద ప్రజల వద్ద నుండి ఎకరానికి రూ.5 నుండి 6 లక్షలకే కొనుగోలు చేసిన భూములను, దళారులు అక్రమ పద్ధతుల్లో పట్టాలుగా మార్చించి, కంపెనీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించి, లేఅవుట్లు, ఫామ్ హౌసులు, పామ్ ల్యాండ్లుగా మార్చి ఎకరానికి రూ.3 కోట్ల వరకు విక్రయించినట్లు ఆరోపించారు.ప్రత్యేకంగా సర్వే నెంబర్ 107లో ఉన్న 12 ఎకరాల 16 గుంటల భూమిపై పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని తెలిపారు. ఇందులో 4 ఎకరాల 4.39 గుంటల భూమిని భవాని డ్రీమ్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ వంగ ప్రణీత రెడ్డి పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు పేర్కొన్నారు. అసలైన పట్టాదారులను మోసం చేసి, తెల్ల కాగితాలపై అగ్రిమెంట్లు తీసుకుని, నో అబ్జెక్షన్ పత్రాలు చేర్చి భూములను దోచుకున్నారని వివరించారు.పాత రికార్డుల ప్రకారం 1954 నుండి ఈ భూమి మహబూబ్ సాబ్ పేరిట లావాణి ఖాతాగా ఉండగా, అనంతరం ఎలాంటి సరైన ప్రక్రియ లేకుండా ఇతరుల పేర్లకు మార్పులు జరిగాయని తెలిపారు. 2023లో పాస్‌బుక్ నెంబర్ T05180140083, డాక్యుమెంట్ నెంబర్ 3979/2023 ద్వారా కంపెనీకి రిజిస్ట్రేషన్ జరిగినట్లు వివరించారు.ఈ అక్రమాలపై ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కలెక్టర్, చేవెళ్ల ఆర్డీవో, మొయినాబాద్ తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినట్లు చెప్పారు. కొంత మేరకు మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్ చర్యలు తీసుకుని కొన్ని నిర్మాణాలను కూల్చివేసినప్పటికీ, కబ్జాదారులు కోర్టుల్లో కేసులు వేసి అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు.ప్రభుత్వ భూముల కబ్జాలపై పోరాడుతున్న గ్రామస్తులపై, తనపై, అలాగే ఈ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చిన పత్రికా ప్రతినిధులపై కూడా కేసులు నమోదు చేయడం ఆందోళనకరమని పేర్కొన్నారు.కావున, ఈ భూములను 1977 పోటి చట్టం ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకుని గ్రామ అభివృద్ధికి వినియోగించాలనీ లేదా అసలు బాధితులకు తిరిగి అప్పగించాలనీ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని పత్రికా ముఖంగా విజ్ఞప్తి చేశారు.



