కుప్పకూలిన రైతులు -వడ్లు, మక్కలు, జొన్నలు కొనకుండా కాంగ్రెస్ సర్కార్ చెలగాటం - కంచర్ల కృష్ణారెడ్డి BRS రాష్ట్ర నాయకులు
- ఇది మోదీ పాపం.. ఇది రేవంత్ శాపం
- కొనుగోళ్ల పడిగాపుల్లో గాల్లోకి ప్రాణాలు
- కాడి పారేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
- పంట కొనని ప్రభుత్వానికి తోడు వడదెబ్బ, వానదెబ్బ
- ప్రాణాలు పణంగా పెట్టి పడిగాపులు పడుతున్న రైతులు
విశ్వంభర, హైదరాబాద్ :- కొనుగోళ్ల కోసం పడిగాపుల్లో రైతు ఓడిపోతున్నడు. వడ్లో, మక్కలో, జొన్నలో రాశి పోసుకొని ప్రభుత్వం కొనకపోతుందా? అన్న నిరీక్షణలోనే విగత జీవిగా మారుతున్నడు. రైతుల ప్రాణాలు పోతున్నా పంట కొనుగోళ్లను పట్టించుకునే నాథుడే లేడు. కాడి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కాంటా కూడా వదిలేసింది!ప్రాణాలు తీస్తున్న ఎండలు ఒకవైపు! పంటల్ని ముంచుతున్న వర్షాలు మరోవైపు! నడిమిట్ల ప్రాణాలు పణంగా పెట్టి పడిగాపులు పడుతున్నారు రైతులు. స్పందించని సర్కార్‌ను నమ్ముకొని, కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. చినుకుపడితే వడ్లు తడవకుండా తండ్లాడుతున్నరు. మండుటెండల్లో వడ్లు ఆరబోసుకొని అవస్థలు పడుతున్నరు. పిడుగుపడితే బక్కజీవి ఒక్కసారిగా కుప్పకూలుడే! వడగాలి తగిలితే విగతజీవిగా మారుడే! ఆదిలాబాద్ నుంచి ఖమ్మం దాకా ఒకే వెత!ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో ఇద్దరు రైతులు వరికుప్పలపైనే తనువు చాలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో ధాన్యం కొనుగోలు కోసం నాలుగు రోజులుగా నిరీక్షిస్తున్న గౌరయ్య.. వడగాలికి వడ్ల కుప్పపైనే ప్రాణం వదిలాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి కొనుగోలు కేంద్రంలో నెలరోజుల క్రితం వడ్లు తెచ్చి పోసిన రైతు నీలం వెంకన్న.. కాంటా వేస్తున్న సమయంలో పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డాడు. బక్కరైతును బలిపీఠం ఎక్కిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం!



