యువ న్యాయవాదుల పట్ల హైకోర్టు న్యాయమూర్తి తీరు అభ్యంతరకరం 

యువ న్యాయవాదుల పట్ల హైకోర్టు న్యాయమూర్తి తీరు అభ్యంతరకరం 

విశ్వంభర, నిజామాబాద్ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ  జస్టిస్ టి రాజశేఖర్ రావు  ముందు విచారణ సందర్భంగా  ఒక యువ న్యాయవాదిని ఏకపక్షంగా 24 గంటలు జ్యుడీషియల్ కస్టడీకి తీసుకోవాలని ఆదేశించారని  ఇటీవల వచ్చిన వార్తలపై న్యాయవాది పరిషత్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేస్తుందని న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. ఆ యువ న్యాయవాది కోర్టులో పదే పదే పశ్చాత్తాపం వ్యక్తం చేసి క్షమాపణ కోరారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా  ముఖ్యంగా యువ న్యాయవాదుల్లో తీవ్ర నిరాశ కలిగించింది.  బెంచ్, బార్ మధ్య సంబంధం పరస్పర గౌరవం, సహనం, సంస్థాగత సమతుల్యత పై ఆధారపడి ఉండాలి.
న్యాయవాదులు కోర్టు అధికారులు. న్యాయ పరిపాలనలో వారి పాత్ర కీలకం. కోర్టుల అధికారం, గౌరవం తప్పక కాపాడాలి. కానీ న్యాయ అధికారాల వినియోగం కూడా సంయమనం, నిష్పత్తి, న్యాయం, కరుణను ప్రతిబింబించాలి. రాజ్యాంగ వ్యవస్థకు మూలం '' రూల్ ఆఫ్ లా" కోర్టులో గౌరవం, క్రమశిక్షణ పాటించాలి. అదే సమయంలో న్యాయ అధికారం వినియోగంలో న్యాయం ఉండాలి.
నేర్చుకుంటున్న యువ న్యాయవాదులతో వ్యవహరించేటప్పుడు  సహనం సమతుల్య ప్రవర్తన ద్వారానే న్యాయవ్యవస్థ బలం తెలుస్తుంది. యువ న్యాయవాదిపై కఠిన చర్య తీసుకోవడం పట్ల న్యాయవాది పరిషత్ అభ్యంతరం తెలుపుతూ, న్యాయమూర్తులు యువ న్యాయవాదుల పట్ల మరింత సహనంతో, కరుణతో వ్యవహరించాలని కోరింది. యువ న్యాయవాదులలో భయం, అవమానం లేదా బెదిరింపు కలిగించే ఏ చర్య అయినా న్యాయవాద వృత్తి స్వాతంత్య్రాన్ని , న్యాయ వ్యవస్థ యొక్క సరైన పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉందని న్యాయవాది పరిషత్ దృఢంగా విశ్వసిస్తోంది. గౌరవనీయ భారత ప్రధాన న్యాయమూర్తి  ఈ విషయంపై తగిన సంస్థాగత స్థాయిలో దృష్టి సాధించి, సంబంధిత రికార్డులు , విచారణలను తెప్పించుకుని, న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటం , బార్-బెంచ్ మధ్య సత్సంబంధాలను కొనసాగించడం కోసం సరైనవిగా భావించే దిద్దుబాటు ,పరిపాలనాపరమైన చర్యలను పరిశీలించాలని న్యాయవాది పరిషత్  కోరుతోంది.

Tags: