రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

విశ్వంభర, సూర్యాపేట: రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతోందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక'లో భాగంగా మార్కెటింగ్, అనుబంధ శాఖలు ఉద్యాన పట్టు పరిశ్రమ, పశు సమర్థక శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో మూడవ రోజు రైతులకు అవగాహన కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాగు విధానాలు మరియు ప్రభుత్వ పథకాలపై రైతులకు దిశానిర్దేశం చేశారు. రైతులకు సాగు పెట్టుబడి కోసం రైతు భరోసా, అకాల మరణం సంభవిస్తే కుటుంబానికి అండగా రైతు భీమా పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని  తెలిపారు.  ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర కల్పించడంతో పాటు సన్న బియ్యం పండించే రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తూ ప్రోత్సహిస్తుందని అన్నారు. సూర్యాపేటలో నూతనంగా భూ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. భూసార పరీక్షల నివేదిక ఆధారంగా ఏ భూమిలో ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో వ్యవసాయ అధికారులు సూచిస్తారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ మరియు ఖర్చు తగ్గింపులో భాగంగా నానో యూరియా వినియోగం పై రైతుల్లో అవగాహన పెంచాలని అధికారులను ఆదేశించారు.  ఒకే రకమైన పంటలు వేయకుండా, లాభదాయకమైన ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని కోరారు. రైతులను నిలువునా ముంచే నకిలీ విత్తనాల విక్రయదారుల పట్ల కఠినంగా     వ్యవహరిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్, పోలీసులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని, 
రైతులు కూడా గుర్తింపు పొందిన డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
సమాజంలో ప్రతి ఒక్కరు రైతు పండించే ఆహారం మీదనే ఆధారపడి జీవిస్తున్నారని,  అందుకే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను, ప్రోత్సాహకాలను అందిస్తోందని తెలిపారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సూర్యాపేట మార్కెట్ లో మొక్కజొన్న పంట అమ్మకాలు చేసుకునేలా  మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని  ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రానున్న రోజుల్లో వరితో పాటు రైతులకు లాభసాటి తెచ్చే పంటలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని, ఆయిల్ ఫామ్, కూరగాయల సాగుపై జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నట్లు  వెల్లడించారు. రైతుల కోసం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం రూ.5/- లకె భోజనం ఏర్పాటు చేసిన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీని కలెక్టర్ అభినందించారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని వ్యవసాయ మార్కేట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న ధాన్యానికి రూ.500బోనస్, సన్న బియ్యం పంపిణీ, రేషన్ కార్డులను ఇచ్చిన ఘనత  సీఎం రేవంత్ రెడ్డిది అని కొనియాడారు. మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర ఇస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట మార్కెట్లో మామిడి మార్కెట్ ఏర్పాటు కొరకు స్థల పరిశీలన చేస్తున్నారని త్వరలోనే పేట మార్కెట్ లో మామిడి మార్కెట్  ప్రారంభం కాబోతున్నట్లు వెల్లడించారు సూర్యాపేటలో రూ.33కోట్లతో నిర్మించి నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను కూరగాయల రైతుల కోసం రూ.31లక్షలతో మరమ్మతులు పూర్తి చేసి త్వరలోనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతుల మీదిగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాసరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగేశ్వర్ శర్మ, జిల్లా సహకార అధికారి ప్రవీణ్ కుమార్, వెటర్నరీ డిడి శ్రీనివాస్, జిల్లా ఆర్టికల్చర్ అధికారి నాగయ్య, కెవికె సైంటిస్ట్ నరేష్ సెక్రెటరీ ముకురం ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు.

Tags: