ఆమెకు ఆమే సాటి
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం, చినుకు ఫైన్ ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో “ఆమెకు ఆమే సాటి” పేరుతో నృత్య గురువుల సమావేశం హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఏప్రిల్ 11 నుంచి 14 వరకు జరిగే కుల నిర్మూలన ఉత్సవాల్లో ‘నృత్య నీరాజనం’ కార్యక్రమంలో శాస్త్రీయ నృత్య గురువులు, శిష్య బృందాలతో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.పి.ఎన్ మూర్తి మాట్లాడుతూ సామాజిక మార్పు కోసం కళలను ఉపయోగించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా చైతన్యాన్ని రగిలించే పాటలకు నృత్య రూపం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జి.లావణ్య, రాధిక శ్రీనివాస్, లక్ష్మీదేవి ఆధ్వర్యంలో గురువులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం ఆచార్య ఘంటసాల పవన్ కుమార్, వరుణ్ పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత, వైశాకి, ప్రతిభా రాజ్, జ్ఞానేశ్వరి, ఇందిరా, శృతి, శిరీష, రాజ్యలక్ష్మి, ఎస్సార్ వెంకన్న తదితర నృత్య గురువులు పాల్గొన్నారు.



