మున్సిపల్ పోరుకు ‘అమెరికా’ నుంచే రేవంత్ దిశానిర్దేశం
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, అక్కడి నుంచే పార్టీ శ్రేణులకు ఎన్నికల యుద్ధతంత్రాన్ని వివరించారు
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, అక్కడి నుంచే పార్టీ శ్రేణులకు ఎన్నికల యుద్ధతంత్రాన్ని వివరించారు. శనివారం జరిగిన జూమ్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు, సీనియర్ నాయకులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లకు సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక, క్షేత్రస్థాయి ప్రచారంపై పలు కీలక సూచనలు చేశారు.
ఈ మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి వార్డు, ప్రతి డివిజన్ గెలుపు ముఖ్యమని.. ఏమాత్రం అజాగ్రత్త వద్దని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులను ఢీకొట్టేలా బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని తెలిపారు. ఎంపిక విషయంలో సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అలాగే పార్టీలో అసమ్మతి లేకుండా చూడాలన్నారు. రెబల్ అభ్యర్థులతో స్వయంగా మాట్లాడి, వారిని బుజ్జగించి సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లదే అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల మధ్య ఎలాంటి గ్యాప్ ఉండకూడదని.. సమిష్టిగా ముందుకు సాగి కేడర్‌లో ఉత్సాహం నింపాలని రేవంత్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే బలహీనంగా ఉందో, ఆ మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.



