'సంక్షోభ కాలం – సామాజిక మార్పు' ప్రజా గ్రంథాలయాల ఆవశ్యకత' అనే అంశాలపై రంగవల్లి స్మారకోపాన్యాసాలు

రంగవల్లి విజ్ఞాన కేంద్రం (RVK) ప్రథమ వార్షికోత్సవం

'సంక్షోభ కాలం – సామాజిక మార్పు' ప్రజా గ్రంథాలయాల ఆవశ్యకత' అనే అంశాలపై రంగవల్లి స్మారకోపాన్యాసాలు

నవంబర్ 13, 2025న ఉ. 10 గం.లకు, స్థలం: ఆర్.వి.కె. నంది కమాన్, వేములవాడ

విశ్వంభర, హైదరాబాద్ :- మిత్రులారా, 'కామ్రేడ్ రంగవల్లి అమరత్వానికి 26 ఏళ్ళు. ఆమె 25వ వర్ధంతి సందర్భంగా వేములవాడలో నిర్మాణమైన రంగవల్లి విజ్ఞాన కేంద్రం (ఇంకా నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది.) ప్రారంభించబడి సంవత్సరం నిండింది. కావున రంగవల్లి విజ్ఞాన కేంద్రం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 2025 నవంబర్ 11 నాడు ఉదయం 10 గంటలకు “సంక్షోభకాలం- సామాజిక మార్పు", ప్రజా గ్రంథాలయాల ఆవశ్యకత" అనే అంశాలపై రంగవల్లి స్మారకోపాన్యాసాలు ఉంటాయి, అందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. రంగవల్లి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి అందరిని ఆహ్వానిస్తున్నాం.
 
కామ్రేడ్ రంగవల్లి భారత విప్లవోద్యమం అందించిన వీరనారీమణుల్లో ఒకరు. ఉన్నత విద్యావంతురాలిగా, మార్క్సిస్టు విజ్ఞాన వేత్తగా, స్త్రీ విముక్తి కార్యకర్తగా, ప్రజా విముక్తి సేనానిగా, జనశక్తి నాయకురాలిగా అన్నింటికీ మించి గొప్ప మానవతావాదిగా తన పాతికేళ్ల విప్లవ జీవితాన్ని ప్రజలకు అంకితం చేసింది. ఆమె 1999 నవంబర్ 11న ఎన్కౌంటర్ లో మరణించి మనకు భౌతికంగా దూరమై 26 ఏళ్ళు అవుతున్నా ఆమె విప్లవ ఔన్యత్యానికి, ఆమె త్యాగనిరతి తోడయింది. అది రంగవల్లిని సదా అజరామరం చేస్తుంది. ఆ విధంగా ఆమె విప్లవ జీవితానికి 50 ఏళ్ళు నిండాయని భావించడం కూడా అనుచితంగా ఉంటుంది.
 
కామ్రేడ్ రంగవల్లికి ప్రేరణనిచ్చిన కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ (తను పుట్టి పెరిగిన నిజామాబాద్ జిల్లా నివాసి) 1975 నవంబర్ 5న కాల్చి చంపబడినాడు. నేడు ఆయన 50వ వర్ధంతి జరుగుతుంది. ఈ 50 ఏళ్ల కాలంలో రెండు తరాల గుండా వచ్చిన మార్పులెన్నో ఉన్నాయి.
 
1975 అత్యవసర పరిస్థితి కాలంలో దేశ అంతరంగిక భద్రత పేరిట పౌర హక్కులను రాజ్యాంగ సవరణ ద్వారా తాత్కాలికంగా సస్పెండ్ చేస్తే, నేడు ఎలాంటి ఎమర్జెన్సీలు లేకుండానే జీవించే హక్కుతో సహా రాజ్యాంగపు ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడుతున్నాయి. కుల వివక్ష నానాటికి వెర్రితలలు వేసి పరువు హత్యలుగా దిగజారుతుంది. మతమౌఢ్యం ముదిరిపోతుంది. మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా ఇంకా దిగజారిపోతున్నాయి. ప్రకృతి ప్రకోపం మితిమీరిపోతుంది. పర్యావరణ విధ్వంసంతో అకాల కరువులు- అనూహ్య వరదలు సర్వసాధారణమైపోయాయి. సామ్రాజ్యవాదుల సృష్టిస్తున్న అధర్మ యుద్ధాల కంటే ఇది ఎన్నో రేట్లు నష్టం కలగజేస్తుంది. అభివృద్ధి పేర విధ్వంసకర నమూనా రాజ్యమేలుతున్నది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా పని భారం పెరుగుతూనే ఉన్నది. ఆకలి చావులు తగ్గినా ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ స్థితిలో వివిధ రూపాల్లో ప్రజా పోరాటాలు మరొకవైపు పాలకుల అణిచివేత విధానాలు పెరుగుతూనే ఉన్నాయి.
 
ఈ సమయంలో సమాజంలో మౌళిక మార్పుల కోసం పోరాడుతున్న అభ్యుదయ శక్తులు వివిధ రూపాల్లో చీలిపోయి ఉన్నారు. అభివృద్ధి నిరోధక శక్తులు సంఘటిత దాడులకు ఎగబడుతున్నారు. అందుకే ఈ సంక్షోభ కాలంలో సామాజిక మార్పు దిశగా ఏం చేద్దామో మాట్లాడుకుందాం రండి. అలాగే రంగవల్లి విజ్ఞాన కేంద్రం లాంటి ప్రజా గ్రంథాలయాల పాత్ర ఎలా ఉండాలో జరిగే చర్చల్లో భాగస్వామ్యం కండి. అందరూ ఆహ్వానితులే.
 
 
సభా పరిచయం: పోకల సాయికుమార్, LL.B. (ఆర్వికె సభ్యులు)
సభాధ్యక్షత: అరుణోదయ విమలక్క (ఆర్.వి.కే అధ్యక్షురాలు)
అంశం: సంక్షోభకాలం- సామాజిక మార్పు
వక్త: ప్రొ. కొల్లాపురం విమల (రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి)
అధ్యక్షత: రాజేశ్వరి (ఆర్వికె సభ్యులు)
అంశం:'ప్రజా గ్రంథాలయాల ఆవశ్యకత
వక్త:జూకంటి జగన్నాథం, (ప్రముఖ కవి)
వందన సమర్పణ:(ఆర్వికె సభ్యులు) చెన్నమనేని పురుషోత్తం రావు
 
రంగవల్లి విజ్ఞాన కేంద్రం (RVK), వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం
(R.No.33/2022)

Tags: