ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత
- : మణికొండ వేద కుమార్
విశ్వంభర, బషీర్ బాగ్: ప్రకృతి పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గాలి, నీరు, భూమి వంటి సహజ వనరులను కాపాడటం మన కర్తవ్యం గా భావించి ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి, దాన్ని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు పచ్చని వారసత్వాన్ని అందించాలని దక్కన్ హెరిటేజ్ అకాడమీ చైర్మన్, బాలారణ్య ( సంప్రదాయ వ్యవసాయ క్షేత్రం) వ్యవస్థాపకులు మణికొండ వేద కుమార్ పిలుపునిచ్చారు. ఎర్త్ డే సందర్భంగా మణికొండ వేద కుమార్ ప్రజ్ఞాపూర్‌లోని బాలారణ్య నేచర్ సెంటర్‌లో పర్యావరణ పరిరక్షణ పట్ల తన అంకితభావాన్ని మరోసారి వ్యక్తం చేశారు. నేచర్ సెంటర్ ద్వారా వేద కుమార్ సాంప్రదాయ వ్యవసాయ, ప్రకృతి సంరక్షణను సమన్వయ పరుస్తూ, ప్రతి రోజు ఎర్త్ డే అనే భావనతో నిరంతర సేవలను అందిస్తున్నారు. ప్రకృతితో అనుబంధాన్ని పెంపొందించుకోవడం, జీవరాశులతో మమేకమవడం ఆయన జీవన విధానంలో కీలక భాగంగా నిలిచింది. ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్న చెట్లను ప్రేమతో కౌగిలించుకుని, వాటితో సంభాషిస్తూ ప్రకృతిపై తన ఆప్యాయతను వ్యక్తం చేశారు. చెట్లతో పాటు పశువులు , జంతువులతో కూడా అనుబంధాన్ని పెంపొందిస్తూ, వాటికి అవసరమైన ఆహారాన్ని అందించి జీవరాశుల పట్ల ప్రేమను ప్రతిఫలింపజేశారు. ఎర్త్ డే కార్యక్రమంలో భాగంగా, వ్యవసాయ కూలీలతో కలిసి అనేక రకాల మొక్కలను నాటారు. కూలీలతో సమానంగా పనిచేస్తూ, వారి నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా సమిష్టి కృషికి ప్రాధాన్యతనిస్తున్నారు. బాలారణ్య అభివృద్ధి దిశగా పలు రకాల వృక్షాలను నాటడం ద్వారా పర్యావరణ సంరక్షణలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు



