ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి

  •  :  ఐ.ఎన్.టి.యు.సి రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజిరెడ్డి


విశ్వంభర, బషీర్ బాగ్: దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని, ఆర్టీసీ  కార్మికులు త్వరలోనే శుభవార్త వింటారని ఐ.ఎన్.టి.యు.సి రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజిరెడ్డి అన్నారు.  బషీర్ బాగ్  ప్రెస్ క్లబ్ లో టి.జి.ఎస్.ఆర్.టి.సి, ఐ.ఎన్.టి.యు.సి  స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం  ఐ.ఎన్.టి.యు.సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆర్.డి.చంద్ర శేఖర్, వై.నాగన్న గౌడ్, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్  ప్రధాన కార్యదర్శి జక్కుల మల్లేశ్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్  గొడిశాల అబ్రహంలతో కలిసి మొగుళ్ల రాజిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  మొగుళ్ళ  రాజిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్  ప్రజా ప్రభుత్వంలో ఆర్టీసీ  ఉద్యోగులు సమ్మె బాట పట్టడం బాధకరమన్నారు. ఐ.ఎన్.టి.యు.సి తరపున సమ్మెకు మద్దతు తెలపడంతో పాటు నిరసన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నామని తెలిపారు. ఐ.ఎన్.టి.యు.సి అనుబంధ సంస్థలు ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డితో పాటు ఆర్టీసీ  ఎండి వై.నాగి రెడ్డిని కలిసి కార్మికుల సమస్యలపై వినతి పత్రం అందజేశామని తెలిపారు. అయితే ఆర్టీసీ  జెఎసి ప్రతిపాదించిన 32 డిమాండ్లలో 29 డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రభుత్వంలో  ఆర్టీసీ విలీనంతో పాటు కార్మిక సంఘాల పునరుద్ధరణ అంశాలపై విశ్లేషించేందుకు సమయం కోరుతుందని చెప్పారు. గత బి.ఆర్.ఎస్  హాయంలో ఆర్.టి. సి కార్మికులు 55 రోజులు సమ్మె చేస్తే వారిని పట్టించుకున్న పాపాన పోలేదని, ఇప్పుడు హరీష్ రావు  పాటు బి.ఆర్.ఎస్ నేతలు కార్మికులపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నర సంవత్సరాలలో ఆర్.టి.సి విలీన ప్రక్రియ ఆలస్యం అయినా ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలు అందిస్తున్నారని  చెప్పారు. ప్రభుత్వం ఏర్పడగానే పెండింగ్ ఉన్న 2017 పి.ఆర్.సి  క్లియర్ చేశామని, పెండింగ్ డిఎలు లేకుండా క్లియర్ చేశామన్నారు. 2013 పెండింగ్ బాండ్స్ క్లియర్ చేయడంతో పాటు రూ.1205 కోట్లు ఉన్న పిఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించామని తెలిపారు. అలాగే రూ.690 కోట్లు ఉన్న సిసిఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించామన్నారు. ఇవే కాకుండా నెల వారీగా పిఎఫ్, సిసిఎస్ కి రూ.75 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు.ఈ సమావేశంలో ఎస్.డబ్లు.యు నాయకులు ఎర్రొళ్ల జయ, అఫీజ్ ఖాన్, సురేందర్, వేణుగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: