మున్సిపల్ పోరు: 336 వార్డుల్లో జనసేన పోటీ

మున్సిపల్ పోరు: 336 వార్డుల్లో జనసేన పోటీ

 తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ జనసేన పార్టీ కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన ఆ పార్టీ, మొత్తం 336 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ జనసేన పార్టీ కీలక అడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమైన ఆ పార్టీ, మొత్తం 336 వార్డుల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే అభ్యర్థుల నామినేషన్లు సజావుగా సాగడం, రిటర్నింగ్ అధికారులు వాటిని ఆమోదించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు తమ రిజర్వ్డ్ గుర్తు అయిన 'గాజు గ్లాస్' పైనే పోటీ చేయనున్నారు. జనసేన పార్టీ మొత్తం 11 జిల్లాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, మహబూబాబాద్ జిల్లాలో అత్యల్పంగా 5గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు జనసైనికులు, వీర మహిళలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది.

పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు
ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటిస్తారని, ఫిబ్రవరి 7, 8 తేదీల్లో రోడ్ షోలు నిర్వహిస్తారని గతంలో ప్రకటనలు వచ్చాయి. అయితే, తాజాగా అనివార్య కారణాల వల్ల ఈ పర్యటన రద్దయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధినేత పర్యటన ఉంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఆశించిన అభ్యర్థులు, కార్యకర్తలు ఈ నిర్ణయంతో కొంత నిరాశకు గురయ్యారు.

Read More చండూరులో  ఘనంగా మహా పడిపూజ మహోత్సవం. - పడిపూజలో పాల్గొన్న డా. కోడి శ్రీనివాసులు - అరుణ దంపతులు